కన్నుల పండుగ
ఘనంగా సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 33వ స్నాతకోత్సవాన్ని శనివారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కన్నుల పండువగా నిర్వహించారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, భక్తులు శ్వేత వస్త్రధారులై.. వేడుకల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ ముఖ్యఅతిథిగా హాజరై.. విద్యార్థులనుద్దేశించి ఉపన్యసించారు.
ఉదయం 10.35 గంటలకు విద్యార్థుల బ్రాస్‌బ్యాండ్ వాయిద్యం నడుమ యూనివర్సిటీ బోర్డు ఆఫ్ మేనేజ్‌మెంట్, అకడమిక్ కౌన్సిల్ బృందాన్ని, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీలను, ముఖ్య అతిథి కస్తూరి రంగన్‌ను యజుర్ మందిరం నుంచి స్నాతకోత్సవ వేదికైన సాయికుల్వంత్ సభామందిరానికి తీసుకొచ్చారు. 10.45కు యూనివర్సిటీవిద్యార్థులు వేదపఠనం గావించారు. 10.48కి వైస్ ఛాన్సలర్ శశిధర్ ప్రసాద్ స్నాతకోత్సవాన్ని ప్రారంభించాలని యూనివర్సిటీ వ్యవస్థాపక కులపతి అయిన సత్యసాయిని ప్రార్థించారు.
‘నేను ప్రారంభిస్తున్నాను’ అంటూ సత్యసాయి వాణిని డిజిటల్ స్క్రీన్‌ల ద్వారా వినిపించారు. అనంతరం వీసీ శశిధర్ ప్రసాద్ యూనివర్సిటీ విద్యావిధానం, ఛాన్సలర్ జస్టిస్ వెంకటాచలయ్య, ముఖ్యఅతిథి కస్తూరి రంగన్‌ల నేపథ్యాన్ని వివరిస్తూ ప్రారంభోపన్యాసం చేశారు. యూనివర్సిటీ పరిధిలోని ప్రశాంతి నిలయం, ముద్దనహళ్లి, బృందావన్, అనంతపురం క్యాంపస్‌లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ఏడుగురు పరిశోధక విద్యార్థులకు పీహెచ్‌డీ పట్టాలను ఛాన్సలర్ విశ్రాంత జస్టిస్ వెంకటాచలయ్య చేతుల మీదుగా ప్రదానం చేశారు.
‘తాము ఆర్జించిన జ్ఞానంతో సత్కర్మలను అచరిస్తామం’టూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ముఖ్య అతిథి కస్తూరి రంగన్ ఉపన్యసించారు. విలువలతో కూడిన సనాతన విద్యా వ్యవస్థను సత్యసాయి నెలకొల్పడం గర్వించదగ్గ విషయమన్నారు. 21వ శతాబ్దపు సమాజ అవసరాలకు అనుగుణంగా సత్యసాయి విద్యా వ్యవస్థ రూపుదిద్దుకుందని వివరించారు. విద్యావంతులైన యువత నూతన ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఆవిష్కరణలకు మూలమైన పరిశోధనల వైపు విద్యార్థులను తీసుకెళ్లాల్సిన బాధ్యత యూనివర్సిటీలపై ఉందని అభిప్రాయపడ్డారు.
మానవ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకున్నప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి సాధిస్తుందన్నారు. జాతీయ గీతాలాపనతో స్నాతకోత్సవం ముగిసింది. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్‌జే రత్నాకర్‌రాజు, చక్రవర్తి, మద్రాస్ శ్రీనివాస్, నాగానంద, ఎస్వీ గిరి, టీకేకే భగవత్, ట్రస్ట్ కార్యదర్శి ప్రసాద్ రావు, సిమ్స్ డెరైక్టర్ డాక్టర్ ఓలేటి చౌదరి, జేఎన్‌టీయూ(ఏ) వైస్ ఛాన్సలర్ లాల్‌కిశోర్, కదిరి ఆర్డీఓ రాజశేఖర్, గాయని సుశీల, కర్ణాటక సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ, విశ్రాంత డీజీపీలు హెచ్‌జే దొర, అప్పారావు, ప్రశాంతి నిలయం కౌన్సిల్ చైర్మన్ నరేంద్రనాథ్‌రెడ్డి, సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.