మొక్కల బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్లదే
Published Thu, Oct 10 2013 4:47 AM | Last Updated on Tue, Oct 2 2018 6:35 PM
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఉపాధి హామీ పథకంలో భాగంగా మొక్కలు నాటించడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత కూడా ఇకపై ఫీల్డ్ అసిస్టెంట్లదేనని జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) పీడీ హరినాథ్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పథకంలో కొన్ని రాజీలేని అంశాలను చేర్చినట్లు చెప్పారు. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ విధిగా 3వేల మొక్కలు నాటించడంతో పాటు వాటిని బతికించుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఉపాధి కోసం జాబ్ కార్డు పొందిన కూలీలను ప్రతి వారం కలసి డిమాండ్ తీసుకోవాలన్నారు. డిమాండ్ మేరకు పని కూడా కల్పించాలన్నారు. డిమాండ్ తీసుకోకపోయినా, పని కల్పించకపోయినా జీతంలో 25 శాతం కోత విధిస్తామని పేర్కొన్నారు.
ఈ ఏడాది నుంచి పండ్ల తోటల రైతులకు, బండ్ ప్లాంటేషన్‌కు బిల్లులు చెల్లించే విధానాన్ని మార్చినట్లు తెలిపారు. గత ఏడాది వరకు బిల్లుల చెల్లింపు కష్టతరంగా ఉండేదని.. దీనిని సరళం చేయడం ద్వారా తేలికగా బిల్లులు పొందే వీలు కల్పిస్తున్నామన్నారు. పండ్ల తోటలు, బండ్ ప్లాంటేషన్ నిర్వహణకు చెట్టుకు రోజుకు 50 పైసల ప్రకారం చెల్లిస్తామన్నారు. ప్రతి నెలా 25 నుంచి 30వ తేదీ మధ్య ఉపాధి సిబ్బంది రైతు వారీగా ఎన్ని చెట్లు నాటారు.. ఎన్ని బతికి ఉన్నాయో లెక్కించి ప్రతి నెల 15వ తేదీ లోపు పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
బండ్ ప్లాంటేషన్ కింద టేకు, ఎర్ర చందనం మొక్కలు 10 లక్షలు నాటి లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. ఆగస్టు చివరి నాటికి 4 లక్షల మొక్కలు నాటగా సెప్టెంబర్ నెలలోనే 6 లక్షల మొక్కలు నాటినట్లు వివరించారు. మొక్కలు నాటేందుకు ఆగస్టు 15వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారని.. ఈ లోపు 2500 ఎకరాల్లో మొక్కలు నాటినట్లు చెప్పారు. ఈనెల నుంచి వచ్చేనెల వరకు ప్రతి గ్రామం వారీగా పనులు గుర్తించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతామన్నారు. ఇందిరమ్మ పచ్చతోరణం కింద 327 మందికి చెట్టు పట్టా ఇచ్చి 50వేల పండ్ల మొక్కలు నాటించినట్లు వెల్లడించారు.
Advertisement
Advertisement