
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 363కి చేరింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం రాత్రి 8 వరకు 674 శాంపిళ్లు పరీక్షించగా 15 కేసులు పాజిటివ్‌గా వచ్చాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 11 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 2, తూర్పు గోదావరి, కడప జిల్లాలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి.
పదికి చేరిన డిశ్చార్జిలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన బాధితుడు కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు. బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిన ఈ యువకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో మార్చి 23న తిరుపతి జీజీహెచ్ ఎస్వీఆర్‌ఆర్ హాస్పిటల్‌లో చేరారు. ప్రోటోకాల్ ప్రకారం మూడుసార్లు జరిపిన టెస్టుల్లో నెగిటివ్‌గా తేలడంతో డిశ్చార్జి చేశారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 10కి చేరింది. కరోనా బారిన పడి అనంతపురం, గుంటూరు జిల్లాలో ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది.
అనంతపురంలో 70 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్ 6న కరోనా లక్షణాలతో హాస్పిటల్‌లో చేరగా ఆ మర్నాడే చనిపోయాడు. 8వ తేదీన శాంపిళ్లలో పాజిటివ్‌గా వచ్చింది. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన 45 సంవత్సరాల వ్యక్తి ఆరోగ్యం పూర్తిగా విషమించిన తర్వాత 7వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకు హాస్పిటల్‌లో చేరగా అదే రోజు మధ్యాహ్నం 2.15కు మరణించాడు. బాధితుడు కరోనా పాజిటివ్‌గా శాంపిళ్లలో తేలింది. గుంటూరు జిల్లాలో కరోనాతో ఇదే తొలి మరణం. నరసరావుపేటలోని వరవకట్ట, రామిరెడ్డిపేటలో పరిధిలో మూడు కిలోమీటర్లను రెడ్ జోన్ గా ప్రకటించారు. పొన్నూరులో కూడా కరోనా కేసు వెలుగులోకి రావడంతో పట్టణంలోని శరాబ్ బజారుకు కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్‌గా ప్రకటించి రసాయనాలను పిచికారీ చేశారు.