సాక్షి, అమరావతి : కరోనా అంటే జలుబు, జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇలా పదికి పైగా లక్షణాలు కనిపిస్తాయంటున్నారు వైద్యులు. కానీ రాష్ట్రంలో నమోదవుతున్న 75 శాతం కేసుల్లో కరోనా వైరస్ లక్షణాలు ఏవీ కనిపించడం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. గురువారం నాటికి రాష్ట్రంలో 1,403 కేసులు నమోదవగా అందులో 1050కి పైగా కేసుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించ లేదని వెల్లడించింది. అయితే కరోనా వైరస్ వ్యాధి సోకిన వ్యక్తి, కుటుంబ సభ్యులు, ఆ వ్యక్తి కలిసిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తుంటే మాత్రం ఎలాంటి లక్షణాలు లేనివారికి పాజిటివ్ ఫలితాలు వస్తున్నాయని తెలిపింది.
వీరి నుంచే వైరస్ వ్యాప్తి చెందుతోంది
కరోనా వైరస్ లక్షణాలు కనిపించకపోవడంతో వీరు బయట తిరుగుతున్నారని, దీని ద్వారా ఇతరులకు విస్తరిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పరిశీలనలో తేలింది. పాజిటివ్ కేసులు నమోదైన వారిలో నాల్గింట మూడో వంతు మందికి ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో వీరు వైరస్ క్యారియర్స్‌గా ఉన్నట్లు గుర్తించింది. అంతేకాకుండా వీరంతా 60 ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం. వయో వర్గాల వారీగా పరిశీలిస్తే వైరస్ నమోదవుతున్న వారిలో అత్యధికంగా 20 నుంచి 40 ఏళ్లలోపు వారు 44–45 శాతం మంది ఉన్నారు. వీరి తర్వాత అత్యధికంగా 40 నుంచి 60 ఏళ్లలోపు వారు ఉన్నారు. వైరస్ లక్షణాలు ఉన్న కేసుల్లో చిన్న పిల్లలు 5 శాతం ఉంటే, లక్షణాలు లేని కేసుల్లో పిల్లలు 13 శాతం వరకు ఉంటున్నారు. ఇలా కరోనా లక్షణాలు లేకుండా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు భౌతిక దూరమే పరిష్కారమని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
లక్షణాలు ఉన్న వారిలో వయస్సుల వారీగా కరోనా సోకిన వివరాలు (శాతాల్లో)
Comments
Please login to add a commentAdd a comment