మదన్‌పల్లి కొత్తతండాలో యువకుల ఆందోళన
స్వాధీనం చేసుకున్న సారా.. ఎక్సైజ్ అధికారులకు అప్పగింత
శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్:
సారా అమ్మకాలపై యువకులు కదం తొక్కారు. తండాలో ఓ యువకుడిని బలిగొన్న సారాను నిషేధించాలని డిమాండ్ చేశారు. విక్రయ కేంద్రాల్లో సారాను స్వాధీనం చేసుకొని ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. వివరాలు.. మండలంలోని మదన్‌పల్లి కొత్తతండాకు చెందిన కొర్ర చందు(28) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆయన ఇటీవల సారాకు బానిసయ్యాడు. ఈక్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురైన అతడు ఈనెల 22 రాత్రి మృతిచెందాడు. దీంతో తండాలోని యువకులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తండాలో సారా అమ్మకాలను నిలిపివేయాలని సోమవారం ఆందోళనకు దిగారు. సారా రక్కసికి బానిసై ప్రాణాలు కోల్పోతున్నారని, దీంతో కుటుంబాలు రోడ్డుమీద పడుతున్నాయని మండిపడ్డారు. తండాలోని విక్రయకేంద్రాలపై దాడి చేసి సారాను స్వాధీనం చేసుకున్నారు. కొందరు మహబూబ్‌నగర్ ప్రాంతం నుంచి సారాను తీసుకొచ్చి సీసాల లెక్కన విక్రయిస్తున్నారని చెప్పారు.
ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంతోనే సారా విక్రయదారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. యువకుల ఆందోళన విషయం తెలుసుకున్న శంషాబాద్ సివిల్, ఎక్సైజ్ పోలీసులు తండాకు చేరుకొని వివరాలు సేకరించారు. యువకులతో మాట్లాడి శాంతింపజేశారు. ఎక్సైజ్ అధికారులు తండాకు చేరుకుని వివరాలు సేకరించారు. తండాలో సారా విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని, యువకులు సహకరించాలని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. యువకులు స్వాధీనం చేసుకున్న సారాను ఠాణాకు తరలించారు.
సారా విక్రయాలపై సమరం
Published Mon, Feb 24 2014 11:30 PM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement