అమాత్య రేసులో ఇద్దరు సాను‘కుల’మయ్యేనా ! fight for minister positions | Sakshi
Sakshi News home page

అమాత్య రేసులో ఇద్దరు సాను‘కుల’మయ్యేనా !

Published Sat, May 24 2014 2:12 AM | Last Updated on Wed, Apr 3 2019 8:48 PM

అమాత్య రేసులో ఇద్దరు సాను‘కుల’మయ్యేనా ! - Sakshi

 మంత్రి పదవుల ఆశావహులకు సామాజిక వర్గం గుబులు పట్టుకుంది. సీనియారిటీ ఉన్నా సామాజిక వర్గ సమీకరణాలతో తమకు మంత్రి పదవులు దక్కుతాయా అన్న టెన్షన్ వారిలో మొదలైంది. దీంతో రాజధానికి పరుగులు తీస్తున్నారు. లాబీయింగ్‌లో నిమగ్నమయ్యారు. అధినేత చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.  జిల్లాకు రెండు పదవులు వస్తాయా? ఒకటితో సరిపెడతారా? మొండి చేయి చూపిస్తారా అన్న సందేహాలు ఆ పార్టీ నేతల్లో నెలకొన్నాయి.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. సీనియారిటీ ప్రకారం చూస్తే కాపు సామాజిక వర్గం నుంచి ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన పతివాడ నారాయణస్వామి, వెలమ సామాజిక వర్గం నుంచి రెండో పర్యాయం ఎన్నికైన కోళ్ల లలితకుమారి మంత్రి పదవుల రేసులో ముందు వరుసలో ఉన్నారు. పతివాడతో పోల్చితే లలితకుమారి సీనియారిటీ తక్కువగా ఉన్నా తాత కోళ్ల అప్పలనాయుడు పార్టీకి అందించిన సేవలే ఆమెను ముందు వరుసలోకి తెచ్చి పెట్టాయి. జిల్లాలో ఎన్నికైన మిగతా ఎమ్మెల్యేలు అమాత్య పదవులు ఆశిస్తున్నా వారికంత సీన్ లేదనే వాదన ఉంది.
 
 పతివాడ, కోళ్లను కూడా పీడిస్తున్న భయం..
 అయితే, ఇప్పుడు పతివాడ నారాయణస్వామినాయుడు,  కోళ్ల లలితకుమారిలకు కూడా భయం పట్టుకుంది. దీనికి ఉత్తరాంధ్ర జిల్లాల సామాజికవర్గ సమీకరణాలే కారణంగా తెలుస్తోంది. పక్క జిల్లా అయిన శ్రీకాకుళంలో కాపు సామాజిక వర్గం నుంచి కిమిడి కళా వెంకటరావు, వెలమ సామాజిక వర్గం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రధానంగా మంత్రి పదవులను ఆశిస్తున్నారు. అందుకు తగ్గ లాబీయింగ్ చేసుకుంటున్నారు. సీనియారిటీ ఉండడంతో పాటు కాపు సామాజిక వర్గ పెద్ద నేతగా కళా వెంకటరావు చెలామణి అవుతున్నారు. ఇక, అచ్చెన్నాయుడు విషయానికొస్తే తన అన్న, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడికి పార్టీలో ఉన్న ప్రాధాన్యం మేరకు ప్రతిపాదిత జాబితాలోకి వచ్చారు.
 
ఈ ఇద్దరే కాకుం డా ఆ జిల్లాలో గౌతు శ్యాంసుందర్ శివాజీ కూడా పదవి ఆశిస్తున్నారు. మరో పొరుగు జిల్లా అయిన విశాఖలో కూడా అదే సామాజిక వర్గాల నుంచి మంత్రి పదవులను ఆశిస్తున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి గంటా శ్రీనివాసరావు, వెలమ సామాజిక వర్గం నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి రేసులో ఉన్నారు. అందుకు తగ్గ పైరవీలు చేసుకుంటున్నారు. పార్టీ కీలక నేతల ఆశీస్సులు కూడా వారికి ఉన్నాయి. ఈ విధంగా అటు శ్రీకాకుళంలో కిమిడి, కింజరాపునకు, ఇటు విశాఖ నుంచి గంటా, చింతకాయల, బండారులను మంత్రి వర్గంలోకి తీసుకుంటే అదే సామాజిక వర్గానికి చెందిన విజయనగరం జిల్లా నేతలు పతి వాడ నారాయణస్వామినాయుడు, కోళ్ల లలితకుమారిలను పరిగణనలోకి తీసుకుంటారా అన్నసందేహం నెలకొంది.
 
పొరుగు జిల్లా నేతలకు ఉన్న పలుకుబడి, ఆర్థిక బలం, లాబీయింగ్ వీరికి లేవని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆ రెండు జిల్లా నేతలతో పోటీపడి పతివాడ, కోళ్ల ముందుకు రాగలరా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల  సమీకరణాలను పక్క న పెట్టి జిల్లాకు రెండు మంత్రి పదవులు కేటాయిస్తే రేసులో ఉన్న  ప్రధాన నేతలిద్దరికీ దక్కనున్నాయి. ఒకవేళ జిల్లాకు ఒకటే కేటాయిస్తే అది ఎవరికి దక్కుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో మంత్రి పదవులు ఖాయమనుకుంటున్న పతివాడ, కోళ్లకు టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో రాజధానికి పరుగులు తీస్తున్నారు. అధినేత చుట్టూ తిరుగుతున్నారు. ఆయన దృష్టిలో పడేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు కోటరీ నాయకులతో లాబీయింగ్ చేస్తున్నారు. చివరికి అమాత్య యోగం ఇద్దరినీ వరిస్తుం దా లేదంటే ఒక్కరికే దక్కుతుందా అనేది చూడాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement