చేవెళ్ల/ చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: ‘బట్టలూడదీసి కొడతా.. మీ సంగతి చూస్తా..’ అంటూ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం చేవెళ్లలో నిర్వహించిన రచ్చబండ రసాభాసగా మారింది. ఎమెల్యే చేవెళ్లకు ఎలా వస్తారో చూస్తామని హెచ్చరించిన కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ రచ్చరచ్చ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే రత్నం, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, ఆర్డీఓ చంద్రశేఖర్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, పలు గ్రామాల సర్పంచ్‌లు హాజరయ్యారు. సభ ప్రారంభించబోతుండగా ఎంపీడీఓ చేతులోనుంచి మైకును మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి తీసుకున్నారు.
శంకర్‌పల్లిలో గురువారం నిర్వహించిన రచ్చబండలో కాంగ్రెస్ నాయకులను పరుష పదజాలంతో దూషిం చినందుకు ఎమ్మెల్యే రత్నం క్షమాపణ చెప్పాలని, అప్పటివరకూ కార్యక్రమం జరగనిచ్చేది లేదన్నారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా వేదిక వద్దకు దూసుకొచ్చారు. ‘కాంగ్రెస్ నాయకులను దుర్భాషలాడతావా.. ఎమ్మెల్యే హోదాకు తగునా...కులాల మధ్య చిచ్చు పెడతావా... బట్టలూడదీసి కొట్టు చూద్దాం’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకు మద్దతుగా వేదిక వద్దకు చేరుకున్నారు. కోపోద్రిక్తులైన కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా టీడీపీ నేతల వైపు దూసుకెళ్లారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను వేదికకు దూరంగా తీసుకెళ్లారు.
నేనెవరి జోలికీ పోను.. నా జోలికి వస్తే ఊర్కోను : ఎమ్మెల్యే
కాంగ్రెస్ నాయకులు ఆందోళన కొనసాగి స్తుండగానే ఎమ్మెల్యే రత్నం వివరణ ఇచ్చారు. శంకర్‌పల్లిలో తనను అవమానిం చడానికి, విమర్శించడానికి ప్రయత్నించిన వారిని ఉద్దేశించే అలా అన్నాను తప్ప కాంగ్రెస్ నాయకులందర్నీ అనలేదన్నారు. అసభ్య పదజాలంతో దూషించలేదన్నారు. తాను ఎవరి జోలికీ పోనని, తన జోలికి ఎవరైనా వస్తే ఎలా ఊరుకుంటానని అన్నారు. పరిస్థితులను బట్టి అలా అనాల్సి వచ్చింది తప్ప, కావాలని అనలేదని వివరించారు. దీంతో ఇరువర్గాలు శాంతించడంతో కార్యక్రమాన్ని కొనసాగించారు.
కొనసాగుతున్న సీఎం ఫొటో లొల్లి
‘రచ్చబండ’లో ఏర్పాటుచేస్తున్న ఫ్లెక్సీలో సీఎం ఫొటో వివాదం కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి ఫొటో ఫ్లెక్సీల్లో కనిపించకూడదంటూ రచ్చబండ వేదికవద్ద తెలంగాణవాదులు, కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. కార్యాక్రమానికి ముందే నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం బొమ్మ కనిపించకూడదంటూ అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర ఎస్సీసెల్ కన్వీనర్ పి.వెంకటస్వామి, డీసీసీబీ డెరైక్టర్ ఎస్.బల్వంత్‌రెడ్డి, మార్కె ట్ కమిటీ చైర్మన్ ఎం.వెంకటేశంగుప్తా, వైస్‌చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎం.బాల్‌రాజ్ తదితరులు ఫ్లెక్సీని తొలగిం చడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు. అంతలోనే తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు శ్రీనివాస్, అంజయ్య తదితరులు వేదికమీదకు దూసుకువచ్చి ఫ్లెక్సీని చించివేసే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అరెస్టుచేశారు. చివరికి బ్యానర్‌లో ఉన్న సీఎం బొమ్మను కనిపించకుండా మలి చివేయడంతో వివాదం సద్దుమణిగింది.
చేవెళ్లలో రచ్చరచ్చ
Published Sat, Nov 23 2013 11:57 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement