విశాఖ రూరల్: హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫలాన్ని నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించడానికి సిద్ధమైంది. బాధితులకు తక్షణం నష్ట పరిహారం అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లాలో అన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఉదయం 10 గంటలకు ధర్నాలకు శ్రీకారం చుట్టింది.
తుపాను వచ్చి మూడు వారాలు గడిచినా గ్రామీణ ప్రాంతాల్లో పునరావాస, సహాయక కార్యక్రమాలు నత్తనడకన సాగుతుండడం పట్ల ప్రజల తరపున గళమెత్తేందుకు సన్నద్ధమైంది. జీవీఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నగరంలో హడావుడి చేసి గ్రామాలను, ఏజెన్సీని పట్టించుకోని ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించనుంది. తుపాను బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ పేరుతో టీడీపీ చేసిన అక్రమాలను తూర్పారపెట్టనుంది.
బూటకపు హామీలపైనా..
ఎన్నికలకు ముందు ఇచ్చిన బూటకపు హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేయాలని, హామీ ఇచ్చిన మేరకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు, పించన్లు మంజూరు చేయాలని, ఫీజు రియంబర్స్‌మెంట్, ష్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని, నిరుద్యోగులకు రూ.2 వేలు భృతి ఇవ్వాలని ఇలా చంద్రబాబు హామీలన్నింటినీ నెరవేర్చాలని ఈ ధర్నా ద్వారా డిమాండ్ చేయనున్నారు.
ఈ ధర్నా కార్యక్రమానికి పార్టీ శ్రేణులన్నీ తరలిరాడానికి సన్నద్ధమవుతున్నాయి. నగరంలో సీతమ్మధార ప్రాంతంలో ఉన్న అర్బన్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయనున్నారు.
తుపాను బాధితుల పక్షాన పోరు
Published Wed, Nov 5 2014 4:39 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement