రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసికెళ్లి వారి పక్షాన పోరాడేందుకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు
తణుకు :రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసికెళ్లి వారి పక్షాన పోరాడేందుకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ముందు ఉండాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు. తణుకు పట్టణ పార్టీ కార్యకర్తల సమావేశం స్థానిక పద్మశ్రీ ఫంక్షన్ హాలులో సోమవారం నియోజకవర్గ కన్వీనర్ కారుమూరి వెంకటనాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రజాసమస్యలను ప్రస్తావిస్తూ తమ పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి తన వంతు పాత్రను అసెంబ్లీలో పోషిస్తున్నారని చెప్పారు.
వచ్చే నెల 3, 4 తేదీల్లో మంగళగిరిలో చేపట్టబోయే సమరదీక్షలో కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి వెంకటనాగేశ్వరరావు మాట్లాడుతూ అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు ఇప్పుడు ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఉందన్నారు.
పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన నాయకులు తమపై అక్రమంగా కేసులు నమోదు చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల అధికార పార్టీ నాయకుల వేధింపులకు తాళలేక మృతి చెందిన గణపవరానికి చెందిన పార్టీ కార్యకర్త నాగరాజు కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. మౌనం పాటించి నివాళులు అర్పించారు. పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కర్రి కాశీరెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెన్మత్స రామరాజు, నియోజకవర్గ ఇన్‌చార్జి మంతెన రవిరాజు, నాయకులు ఎస్‌ఎస్ రెడ్డి, బీపీ రవిశంకర్, మద్దిరాల రామసతీష్, కారుమంచి మిత్రా, కడియాల సూర్యనారాయణ, బోడపాటి వీర్రాజు, బూసి వినీత తదితరులు పాల్గొన్నారు.
ప్రజల్ని రోడ్డుపాలు చేసిన చంద్రబాబు
యాళ్లవానిగరువు (పాలకొల్లు అర్బన్): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను రోడ్డుపాలు చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. యాళ్లవానిగరువులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయారన్నారు. డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి అమలు చేయనందుకు నిరసగా, వికలాంగ, వృద్దాప్య, వితంతు పింఛన్లు పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరుతూ మంగళవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. ఉదయం 9గంటలకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ప్రదర్శనగా వెళ్లి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు చెల్లెం ఆనందప్రకాష్, పార్టీ అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్, నేతలు వంగలపూడి యెస్సయా, గీర్ల శ్రీను, నరసాపురం మునిసిపల్ కౌన్సిలర్ వన్నెంరెడ్డి శ్రీనివాసు పాల్గొన్నారు.