గెలుపే ధ్యేయం | YSR Congress Party District president Gowri Reddy Sridhar Reddy with Sakshi interview | Sakshi
Sakshi News home page

గెలుపే ధ్యేయం

Published Wed, Dec 30 2015 3:05 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

గెలుపే ధ్యేయం - Sakshi

గెలుపే ధ్యేయం

* వైఎస్, జగన్ అభిమానులందరినీ ఏకతాటిపైకి తెస్తా
* నిరుద్యోగ, రైతు సమస్యలపై ఉద్యమం
* ప్రజా సమస్యలపైనా నిరంతర పోరాటం
* గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి సిద్ధం
* ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి

సంగారెడ్డి జోన్:  రానున్న 2019లో గెలుపే ధ్యేయంగా పార్టీని ముందుకు తీసుకెళ్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అభిమానులందరినీ పార్టీలకతీతంగా ఏకం చేసి ఏకతాటిపైకి తెస్తానని చెప్పారు. జిల్లా అంతటా విస్తృతంగా పర్యటించి పార్టీ బలోపేతానికి, పటిష్టవంతానికి పాటు పడతానన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం ప్రజల తరఫున పోరాటానికి సన్నద్ధమవుతామని చెప్పారు. కాగా జిల్లాలో వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం మాత్రం కొద్దిమందికి మాత్రమే పరిహారం అందజేసి మిగతా వారికి మొండిచేయి చూపించిందని విమర్శించారు.

రైతులను ఆదుకోవడం కోసం జిల్లాలో వైఎస్‌ఆర్ పార్టీ రాష్ట్ర నాయకురాలు వైఎస్ షర్మిల త్వరలో జిల్లాలో రైతు పరామర్శ యాత్ర నిర్వహిస్తారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడుగా నియామకమైన సందర్భంగా గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి సాక్షితో మాట్లాడారు.
 
సాక్షి: జిల్లాలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు?
శ్రీధర్‌రెడ్డి :
పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదే శాల మేరకు పార్టీ పటిష్టానికి పాటు పడతా. జిల్లాలో పార్టీ బలోపేతానికి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తా. పార్టీ కమిటీల నియామకానికి గ్రామస్థాయి నుంచి మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఎంపిక చేస్తా.
 
సాక్షి: ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల అమలుకోసం ఏం చేస్తారు?
శ్రీధర్‌రెడ్డి : 
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చింది. ముఖ్యంగా నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చింది. అలాగే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో వున్నాయి. యువత, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతా.
 
సాక్షి: రైతు సమస్యలపై మీ అభిప్రాయం?
శ్రీధర్‌రెడ్డి : 
జిల్లాలో రైతులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడులు సైతం రాక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. జిల్లాలో వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కొందరికి మాత్రమే పరిహారం అందింది. రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ఉద్యమిస్తాం.
 
సాక్షి: రానున్న గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ బరిలో వుంటుందా?
శ్రీధర్‌రెడ్డి : 
జిల్లాలో మూడు స్థానాలు గ్రేటర్ మున్సిపాలిటీలో వున్నాయి. పటాన్‌చెరు, భరత్‌నగర్, రామచంద్రాపురంలలో పార్టీ అభ్యర్థులను గ్రేటర్ ఎన్నికల బరిలో వుంటారు. పార్టీ బలోపేతం కోసం అన్ని వర్గాలతో, ప్రజలతో ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement