రూ.178 కోట్లకు లెక్కల్లేవ్!
Published Thu, Jan 23 2014 6:27 AM | Last Updated on Thu, Oct 4 2018 8:36 PM
సాక్షి ప్రతినిధి, విజయనగరం:‘మంజూరైన నిధులకు లెక్కలు చూపిస్తేనే తదుపరి నిధుల్ని విడుదల చేస్తాం.’ బీఆర్‌జీఎఫ్(వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఫండ్) నిధులపై కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరిక ఇది. దీంతో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఆడిట్ అధికారులు వ్యక్తం చేసిన అభ్యంతరాల్ని దాదాపు పరిష్కరించుకుంటున్నారు. కానీ బీఆర్‌జీఎఫ్ యేతర నిధులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. అసలు ఆ నిధుల గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్, 13వ ఆర్థిక సంఘం, రూరల్ డెవలప్‌మెంట్ ఫండ్స్, ఇసుక సీనరేజీ, సాధారణ నిధుల వినియోగాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడంతో స్థానిక సంస్థలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వాల ఉదాసీనతతో నిబంధనల్ని పక్కన పెట్టి, నచ్చినట్టు ఖర్చు చేస్తున్నాయి. ఈ క్రమంలో పాలకులు, అధికారులు చేతి వాటవాన్ని ప్రదర్శిస్తున్నారు. మంజూరైన నిధులకు లెక్కలు చూపించడం లేదు. ఈ విధంగా విడుదలైన నిధులకు, ఖర్చుకు పొంతన కుదరడం లేదు. జిల్లాకు మంజూరైన నిధుల్లో రూ.178.63 కోట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ప్రతీ పైసాకు స్థానిక సంస్థలు లెక్క చూపించాల్సి ఉంది. ఆ మేరకు ఆడిట్ చేయించుకోవాలి.
కానీ మంజూరైన నిధులకు పూర్తి స్థాయిలో లెక్కలు చూపించడం లేదు సరికదా... ఆడిట్‌ను కూడా సరిగా చేయించుకోవ డం లేదు. ఆడిట్ చేసిన వరకూ చూస్తే జిల్లా పరిషత్, మండల పరిషత్‌లు, పంచాయతీలు, మున్సిపాల్టీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థలు, దేవాలయాల్లో ఇప్పటివరకు రూ.178.63 కోట్లకు లెక్కలు తేలలేదు. దాదాపు లక్షా 13వేల 845 అభ్యంతరాలు పేరుకుపోయి ఉన్నాయి. ఇందులో దుర్వినియోగం చేసిన నిధులతో పాటు అడ్వాన్సుల కింద వాడేసిన నిధులకు లెక్కలు చూపడం లేదు. ఎం- బుక్‌లో రికార్డు చేయకుండా నిధుల వినియోగించినట్టు కూడా ఆడిట్‌లో తేలింది. ఇక రికార్డులు గల్లంతు చేసిన వ్యవహారం కూడా పలుచోట్ల వెలుగు చూసింది. ఆడిట్ అధికారులు వ్యక్తం చేసిన ప్రతి అభ్యంతరానికీ అధికారులు సమాధానం చెప్పాలి. అయితే ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏటా ఆడిట్ అభ్యంతరాలు పేరుకుపోతున్నాయి.
ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించకపోవడమే దీనికి కారణం. అభ్యంతరాల్ని పరిష్కరి స్తేనే నిధులు విడదల చేస్తామని బీఆర్‌జీఎఫ్‌కు ఏ రకంగానైతే షరతులు విధించారో ఆ దిశగా మిగతా నిధుల వినియోగంపై వ్యవహరించి ఉంటే తప్పనిసరిగా లెక్కలు చూపించేవారు. కానీ మన పాలకులు, ఉన్నతాధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నిధులిచ్చి చేతులు దులుపుకోవడం తప్ప అవి సక్రమంగా ఖర్చు అయ్యాయా ? లేదా ? అన్నదానిపై దృ ష్టి సారించడం లేదు. పోనీ ఆడిట్ అధికారులు వ్యక్తం చేసిన అభ్యంతరాల్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలని లేదంటే చర్యలు తీసుకోవల్సి వస్తోందని కనీస హెచ్చరికలు కూ డా చేయడం లేదు. ఈ క్రమంలో రూ.178 కోట్లు అతీగతి లేకుండా పోయాయి. ఏళ్లు గడుస్తున్నా ఏమయ్యాయో తేలడం లేదు. దీంతో అవన్నీ స్వాహా అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇవీ చేయాలి...
కార్యాలయంలో జరిగిన ప్రతీ ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన రికార్డులను చూపించాలి.
ఖర్చుకు సంబంధించిన ఓచర్లు, బిల్లులు సమర్పించాలి.
మంజూరు ఉత్తర్వులు చూపించాలి.
చెక్‌బుక్‌లు సమర్పించాలి.
{sెజరీ, బ్యాంకు పాసు పుస్తకాలను సైతం అందజేయాలి.
ఒక్కొక్క లావాదేవీకి సంబంధించిన రిజిస్టర్‌లను కూడా చూపించాలి.
ఆడిట్ రిపోర్టు ఇచ్చిన 60 రోజుల్లోగా సాధారణ అభ్యంతరాలకు జవాబులివ్వాలి.
{పత్యేక లేఖ ద్వారా తెలియజేసిన తీవ్రమైన అభ్యంతరాలకు 120రోజులు సమాధానమివ్వాలి.
{పత్యేక లేఖ ద్వారా తెలియజేసిన అభ్యంతరాలకు నిర్దేశిత గడువులోగా స్పందించకపోతే సర్‌ఛార్జ్ నోటీసు అందుకోవాల్సి ఉంది.
సర్‌ఛార్జ్ లేఖ ఇచ్చిన 60రోజుల్లోగా అభ్యంతరాల సొమ్మును సంబంధిత ఖాతాకు జమ చేయాలి.
జిల్లాలోని స్థానిక సంస్థలపై ఆడిట్ నివేదిక
స్థానిక సంస్థ ఆడిట్ అభ్యంతరాలు లెక్కలు తేలని మొత్తం
జిల్లా పరిషత్ 656 రూ. 48.73కోట్లు
మండల పరిషత్‌లు 4679 రూ. 12.50కోట్లు
గ్రామ పంచాయతీలు 1,02,491 రూ. 69.73కోట్లు
మున్సిపాల్టీలు 3195 రూ.40.5కోట్లు
వ్యవసాయ మార్కెట్ కమిటీలు 247 రూ.2.6కోట్లు
గ్రంథాలయ సంస్థలు 123 రూ.3.5కోట్లు
దేవాలయాలు 2453 రూ.99.40లక్షలు
Advertisement
Advertisement