తెరచాటు ప్రతిపాదనలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి కోసం బీఆర్‌జీఎఫ్ (బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్) పనుల ప్రణాళికను ఈ నెల 26వ తేదీ లోగా తయారు చేసి పంపించాలని గత నెల 12న ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశా రు. జిల్లాకు కేటాయించిన రూ. 22.94 కోట్ల కు పనులకు ప్రతిపాదనలు తయారు చేసి, పక్కా ప్రణాళికను అందజేయాలని ఆదేశాలిచ్చారు. రోడ్లు, సామాజిక భవనాలు పాఠశాలలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలతో పాటు గత ఏడాది చేపట్టి అసంపూర్తిగా మిగిలిపోయిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని ప్రత్యేక మార్గదర్శకాలిచ్చారు.
ఆ మేరకు కాల పరిమితితో కూడిన షెడ్యూల్ ఇచ్చారు. కానీ, జిల్లా పరిషత్ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఎలాగూ కొత్త పాలక వర్గం వస్తుందని, వారి ఆధ్వర్యంలో చేపట్టి మార్కులు కొట్టేయవచ్చన్న అభిప్రాయంతో ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేశారని తెలిసింది. ఇదే విషయమై ఈనెల 7న ‘అధికారుల...వెనుకంజ’ శీర్షికతో ‘ సాక్షి’లో కథనం ప్రచురితమైంది. గడువు దాటితే నిధులు వెనక్కి మళ్లిపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని అప్పుడే తెలిపినా అధికారుల్లో చలనం కలగలేదు. ‘సాక్షి’ చెప్పినట్టే నిధులు వెనక్కిపోయే అవకాశం ఉందన్న సంకేతాలు తాజాగా జెడ్పీ అధికారులకు అందాయి. దీంతో పాలకవర్గం ఏర్పడే వరకు వేచి చూస్తే అసలుకే మోసం వస్తుందన్న అభిప్రాయానికొచ్చారు. అధికార పీఠం ఎక్కబోతున్న నాయకుల దృష్టికి తీసుకెళ్లి ప్రణాళిక తయారీకి సిద్ధమయ్యారు.
నిబంధనలకు తిలోదకాలు
నిర్ధేశిత గడువు సమీపించడంతో ఆఘమేఘాల మీద పనుల ప్రతిపాదనకు ఉపక్రమించారు. పంచాయతీ, మండల స్థాయిలో ప్రతిపాదిత పనుల జాబితాను బుధవారం (25వ తేదీ)లోగా తయారు చేసి ఇవ్వాలని ఈనెల 21వ తేదీన మండల అధికారులకు ఆదేశాలిచ్చారు. అధికార పార్టీ నేతలతో సంప్రదింపులు చేసి ప్రతిపాదలను తయారు చేయాలని పరోక్షంగా సంకేతాలిచ్చారు. దీంతో ప్రజాభిప్రాయాన్ని గాలికొదిలేసి నాలుగు గోడల మ ధ్య కూర్చొని, అధికార పార్టీ నేతలు చెప్పిన పనులు ప్రతిపాదించి మమ అన్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
షెడ్యూల్ పట్టని అధికారులు
వాస్తవానికి షెడ్యూల్ జారీ చేసిన ప్రకారం మే 12వ తేదీ నుంచి ప్రణాళిక తయారీకి చర్యలు తీసుకోవలసి ఉంది. షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి ఏడు రోజుల వరకు గ్రామసభలు పెట్టి పనులను గుర్తించాలి. 9వ రోజులోగా గ్రామస్థాయిలో అనుమతి పొందాలి. ఆ జాబితాలను 12వ రోజులోగా మండలాలకు పంపించాలి. 14వ రోజులోగా మండల స్థాయిలో సమావేశం నిర్వహించి, గ్రామస్థాయి ప్రతిపాదనలను చర్చించాక అనుమతి తెలపాలి. 17వ రోజులోగా జిల్లా పరిషత్‌కు పంపించాలి. 21వ రోజులోగా మండల ప్రణాళికలను పరిశీలించాలి. 24వ రోజులోగా జిల్లా పరిషత్‌లో తుది నిర్ణయం తీసుకోవాలి. అలాగే జిల్లా పరిషత్ ప్రత్యేకంగా ఒక ప్రణాళిక తయా రు చేయాలి. 27వ రోజులోగా మండల ప్రణాళికను, జిల్లా పరిషత్ ప్రణాళికను జిల్లా ప్రణాళి క కమిటీ (డీపీసీ)కి పంపించాలి. 31వ రోజు లోగా డీపీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. దాన్ని 32వ రోజున ప్రభుత్వానికి సమర్పించాలి. కానీ, జెడ్పీ అధికారులకు అదేమీ పట్టకపోవడంతో షెడ్యూల్ ప్రకారంగా జరగలేదు.
గ్రామ సభలు నిర్వహించకుండానే...
షెడ్యూల్, నిబంధనలను పట్టించుకోకుండా ప్రణాళికలను తయారు చేస్తున్నారు. పనులను గుర్తించేందుకు దోహదపడే గ్రామసభలను నిర్వహించడం లేదు. మండల స్థాయి అధికారులు, అధికార పార్టీ నేతలు ఒకచోట సమావేశమై తమకు తోచిన విధంగా పనులు ప్రతిపాది స్తున్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో ప్రక్రియ ముగిసింది. మిగతా మండలాల్లో మంగళ, బుధవారాల్లోగా పూర్తి చేసేందుకు సమాయత్తమవుతున్నారు. గడువు ముంచుకొస్తుండటం తో అధికార పార్టీ నేతలు చెప్పినట్టే చేసేయాల ని ఉన్నత వర్గాల నుంచి మౌఖిక ఆదేశాలు రావడంతో క్షేత్రస్థాయి అధికారులు వెనకా ముందూ చూడడం లేదు. టీడీపీ నాయకులు చెప్పిన వాటినే ప్రతిపాదిస్తున్నారు.