నకిలీ ఆధార్‌తో స్థలం అమ్మకం
అంపాపురం పరిధిలో ఘరానా మోసం
మృతుడి సోదరుడిని బెదిరించి బలవంతంగా రిజిస్ట్రేషన్
రూ.అరకోటి పైగా స్వాహా ముఠా సభ్యులకు పోలీసుల అండ
విజయవాడ సిటీ : విజయవాడకు చేరువలో రాజధాని ఏర్పాటవుతున్న నేపథ్యంలో విలువైన స్థలాలను కాజేసే ముఠాల ఆగడాలు శృతిమించుతున్నాయి. నకిలీ పత్రాలతో ఖాళీ స్థలాలను కాజేసి అమాయకులకు అంటగడుతున్నారు. మొన్నటికి మొన్న మతిస్థిమితం లేని మహిళకు చెందిన విలువైన స్థలాన్ని నకిలీ ‘ఆధార్’ చూపించి ఓ ముఠా రిజిస్ట్రేషన్ చేయించుకుంది. మృతి చెందిన వైద్యుని స్థలాన్ని తప్పుడు సంతకాలతో స్వాహా చేశారంటూ ‘దేశం’ పార్టీకి చెందిన ఓ నేత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా ఇలాంటి ముఠాల ఆట కట్టించేందుకు పోలీసుశాఖ పరంగా గట్టి చర్యలు కనిపించడం లేదు. దీంతో పదే పదే ఈ తరహా మోసాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనం. జరిగిన మోసం తెలుసుకొని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తే ‘సివిల్’ వివాదమంటూ పట్టించుకోవడం లేదు. దీనిపై బాధితులు నగర పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించారు. కమిషనరేట్ అధికారులు కేసు విచారణ జరపాలంటూ కొత్తపేట పోలీసులకే పంపారు. గతంలో వచ్చిన కేసేనంటూ పోలీసులు పక్కన పడేసినట్టు తెలిసింది. బాధితులకు న్యాయం చేయాల్సిన ‘నాలుగో సింహం’ నిందితుల కొమ్ము కాయడం వెనుక భారీగా ‘మామూళ్లు’ చేతులు మారిన విషయం బహిరంగ రహస్యమే.
జరిగింది ఇదీ..
జిల్లాలోని బాపులపాడుకు చెందిన జంపని నాగేశ్వరరావు, సత్యనారాయణ సోదరులు. నాగేశ్వరరావు కొన్నేళ్ల కిందట దీనదయాళ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ద్వారా అంపాపురం గ్రామ పంచాయతీ సర్వే ఆర్.ఎస్.నెం.105/2బిలో 200 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ స్థలం మార్కెట్ విలువ రూ.60లక్షల పైమాటే. ఇదిలా ఉండగా ఈ ఏడాది మార్చిలో ఈ స్థలాన్ని దేవరాజుగట్టు బెనర్జీ, అతడి స్నేహితుడు దర్శి శ్రీనివాసరావు కొనుగోలు చేశారు. ఒప్పందంలో భాగంగా రూ.30లక్షలు చెల్లించి నగరంలోని గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కొద్ది రోజుల కిందట ఈ స్థలాన్ని మెరక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా నాగేశ్వరరావు భార్య, కుమార్తె అడ్డుకున్నారు. స్థలాన్ని తాము కొనుగోలు చేసినట్లు వారు చెప్పగా.. నాగేశ్వరరావు మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రిజిస్ట్రేషన్ సమయంలో నాగేశ్వరరావు పేరిట గుర్తింపు కోసం ఇచ్చిన ‘ఆధార్’ కార్డు ఆన్‌లైన్‌లో పరిశీలించగా.. ఆయన సోదరుడు జంపని సత్యనారాయణ పేరుతో ఉన్నట్టు తేలింది. ఈ వ్యవహారంలో ఇద్దరు మధ్యవర్తులు చనిపోయిన వ్యక్తి పేరిట నకిలీ ఆధార్‌ను సృష్టించి తమ వద్దనున్న పత్రాలతో ఆ స్థలాన్ని అమ్మినట్టు తేలింది. జరిగిన మోసాన్ని వివరిస్తూ బాధితులు కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే ఆ ముఠాతో సన్నిహిత సంబంధాలు ఉన్న పోలీసులు.. సివిల్ వివాదమంటూ ఫిర్యాదును తీసుకోలేదు. విధిలేని స్థితిలో నగర పోలీసు కమిషనరేట్ ఉన్నతాధికారులను ఆశ్రయించగా, తిరిగి విచారణ కోసం అదే పోలీసు స్టేషన్‌కి వెళ్లింది.
దీని వెనుక పెద్ద ముఠా
ఈ తతంగం వెనుక పెద్ద ముఠా ఉన్నట్టు బాధితులు అనుమానిస్తున్నారు. స్థలం కొనుగోలు సమయంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వ్యక్తుల ద్వారానే నకిలీ ఆధార్ కార్డును సృష్టించి విక్రయాలు జరిపినట్టు చెబుతున్నారు. ఫొటో మార్చకుండా కేవలం పేరు మాత్రమే మార్చేసి పెద్ద మొత్తానికి ఆస్తిని విక్రయించారు. ఈ లావాదేవీ సమయంలో సాక్షులుగా ఉన్న వారు కూడా ఆ ముఠా సభ్యులేననే అనుమానాలను బాధితులు వ్యక్తం చేస్తున్నారు.
పోలీసు వత్తాసు
ఇలాంటి చీటింగ్ వ్యవహారాలపై పోలీసులు నిశితంగా పరిశీలన చేసి నిందితులపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ఈ ముఠాలపై పోలీసులు దృష్టి పెడితే ఇలాంటి మోసాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అలాకాకుండా సివిల్ వివాదమంటూ చెప్పడం నిందితులకు ఒత్తాసు పలికినట్టేనని ఓ సీనియర్ పోలీసు అధికారి అన్నారు. ఏ స్థాయిలో ముడుపులు ముడితే పోలీసులు ఈ విధంగా చెపుతారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.