వరదాపురం సూరి అక్రమంగా కాజేసిన భూమి ఇదే
సాక్షి, పుట్టపర్తి: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత వరదాపురం సూరి అలియాస్ గోనుగుంట్ల సూర్యనారాయణ అనంతపురం నగరంలో రూ. 129 కోట్ల విలువైన 6.35 ఎకరాల స్థలంపై కన్నేశారు. నవోదయ కాలనీ 80 అడుగుల రోడ్డు పక్కనే ఈ స్థలం ఉంది. ఇక్కడ సెంటు రూ.20 లక్షలకు పైనే. అత్యంత విలువైన ఈ స్థలాన్ని నకిలీ పత్రాలతో భూమి తనదని చెప్పుకుంటున్న వ్యక్తి నుంచి తన కుమారుడు, అనుచరుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. సూరి అనుచరులు భూమి అసలు హక్కుదారులను ఖాళీ చేయాలంటూ బెదిరించారు. కబ్జాకు యత్నించారు. హక్కుదారుల ఫిర్యాదు మేరకు సబ్‌రిజిస్ట్రార్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. సూరి కుమారుడు నితిన్‌సాయి, అనుచరుడు రాజుపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు.
మోసం చేశారిలా..
రాళ్లపల్లి నారాయణప్ప 1929లో గుండూరావు నుంచి 301 సర్వే నంబర్‌లో 7.77 ఎకరాలు కొని, పెద్ద మనవడు పెద్ద ఉలిగప్పకు 1933లో హక్కు ఇచ్చారు. 1935లో బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. అయితే.. దొడ్డమనేని మాలతేష్ అనే వ్యక్తి గుండూరావు తన చిన్నాన్న అంటూ 1985 నవంబర్ 19 తేదీతో అన్‌రిజిస్టర్డ్ వీలునామా సృష్టించారు. 1929 నాటికే గుండూరావు పింఛన్ తీసుకుంటున్నారు. అంటే అప్పటికే 60 ఏళ్లు పూర్తయి ఉంటాయి. దీన్నిబట్టి 1985 నాటికి గుండూరావు వయస్సు 116 సంవత్సరాలు. ఇంత వయస్సు ఉన్న వ్యక్తితో అన్ రిజిస్టర్డ్ వీలునామా ఎలా రాయిస్తారన్నది ప్రశ్నార్థకం. 2018లో 301–3 సర్వే నంబర్‌తో 4.46 ఎకరాలు మాలతేష్ పేరిట వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. దీనిపై రాళ్లపల్లి వంశస్తులు ఆర్‌డీవో కోర్టుకు వెళ్లారు. మాలతేష్ సమర్పించిన వీలునామా ఫోర్జరీ అని ఆర్‌డీవో ధ్రువీకరించారు. వెబ్‌ల్యాండ్ నుంచి మాలతేష్ పేరు తొలగించారు. రాళ్లపల్లి వంశస్తుల పేర్లు నమోదు చేశారు.
1933లో రాళ్లపల్లి వంశస్తులు ఆస్తి పన్ను చెల్లించిన పత్రాలు
అక్రమంగా రిజిస్ట్రేషన్
మాలతేష్ సర్వే నంబర్ 301ను 301–3గా చూపించి నితిన్ సాయి ఇండియా ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, వరదాపురం సూరి కుమారుడు గోనుగుంట్ల నితిన్‌సాయి పేరు మీద 4.30 ఎకరాలు, సూరి అనుచరుడు, ధర్మవరానికి చెందిన యంగలశెట్టి రాజు పేరిట 2.05 ఎకరాల స్థలాన్ని 2021 డిసెంబర్ 23న రిజిస్ట్రేష¯Œ చేశారు. నితిన్‌సాయి రూ.6 కోట్లు, రాజు రూ.1.50 కోట్లకు కొన్నట్లు చూపారు. వాస్తవానికి రాళ్లపల్లి వంశస్తుల వద్ద ప్రస్తుతం 3.57 ఎకరాలే ఉంది. వారి భూమిలో కొంత గతంలోనే వేరే వారికి అమ్మారు. 1982లో కొంత లేఅవుట్ వేశారు. మునిసిపాలిటీకి ఆస్తిపన్ను కూడా చెల్లిస్తున్నారు. దీనిని ప్లాట్ల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ సూరి కుమారుడు, అనుచరుడి పేరిట 6.35 ఎకరాలు మాలతేష్ రిజిస్ట్రేషన్ చేశారు.
ఇందులో మునిసిపల్ కార్పొరేషన్ 80 అడుగుల రోడ్డుకు సేకరించిన 0.66 ఎకరాల స్థలం, వార్డు సచివాలయమూ ఉన్నాయి. వెబ్‌ల్యాండ్‌లో మాలతేష్ పేరుపై భూమి లేకపోయినా, అన్ రిజిస్టర్డ్ వీలునామాకు ఎలాంటి విశ్వసనీయత లేనప్పటికీ, సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారు. సబ్ రిజిస్ట్రార్, వరదాపురం సూరిది ఒకే ఊరని, అందువల్లే అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందనే విమర్శలున్నాయి. అనంతరం సూరి అనుచరులు ఆ భూమి తమకు అప్పగించాలని రాళ్లపల్లి వంశస్తులను బెదిరించారు. ఈ వ్యవహారంపై రాళ్లపల్లి వంశస్తులు ఫిర్యాదు చేయడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మాధవి ఆదివారం అనంతపురం సబ్ రిజిస్ట్రార్ హరికృష్ణను సస్పెండ్ చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వరదాపురం సూరి కుమారుడు నితిన్ సాయి, రాజు మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ అంశంపై డీఆర్‌వో నేతృత్వంలో విచారణకు కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. డిప్యూటీ కలెక్టర్, అనంతపురం కార్పొరేషన్ కమిషనర్ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
చర్యలు తీసుకుంటాం
– గాయత్రీదేవి డీఆర్‌వో, అనంతపురం
ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌పై విచారణ జరుగుతోంది. కమిటీ సభ్యుల్లో ఒకరు నివేదిక ఇచ్చారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో వెబ్‌ల్యాండ్‌లోకి ఎక్కించారని, వెంటనే తొలగించామని ఆర్డీవో చెప్పిన విషయాలను నివేదికలో పొందుపరిచారు. మరొక అధికారి నివేదిక ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment