విస్తారాకుల పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో వ్యక్తి సజీవదహనమయ్యాడు. ఈ సంఘటన మండల కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది.
ఘట్‌కేసర్, న్యూస్‌లైన్: విస్తారాకుల పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో వ్యక్తి సజీవదహనమయ్యాడు. ఈ సంఘటన మండల కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలు..
మండల కేంద్రం నుంచి కొండాపూర్ వెళ్లే దారిలో స్థానిక సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ రెండేళ్ల క్రితం నంద పేపర్ ప్రొడక్ట్స్ అనే కాగితపు విస్తరాకుల తయారీ పరిశ్రమను ప్రారంభించాడు. ఏడాదిన్నర క్రితం నల్లగొండ జిల్లా మల్లాపూర్ గ్రామానికి చెందిన నవీన్(30), తన ఇద్దరు మిత్రులతో కలిసి ఈ పరిశ్రమను లీజుకు తీసుకున్నారు. ఈక్రమంలో సోమవారం సాయంత్రం పరిశ్రమ వద్దకు వచ్చిన నవీన్ కరీంనగర్ జిల్లాకు తీసుకెళ్లాల్సిన విస్తరాకుల బండిళ్లను ట్రాలీ ఆటోలో లోడ్ చేసుకున్నాడు. తెల్లవారుజామునే తాను బయలుదేరుతానని చెప్పడంతో మిగిలిన వాళ్లు అక్కడినుంచి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం పరిశ్రమలోని ఓ గదినుంచి పొగ రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపకశాఖకు సమాచారం అందిచారు. ఫైరింజన్ సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేసింది. ఆ తర్వాత లోపలికి వెళ్లి చూడగా నవీన్ మృతిచెంది కనిపించాడు.
ప్రమాదానికి తెలియరాని కారణాలు
ఈ ప్రమాదానికి కారణాలు తెలియరావడం లేదు. షార్ట్‌సర్క్యూట్ జరిగిన ఆనవాళ్లు లేవని పోలీసులు చెబుతున్నారు. పరిశ్రమలోని విస్తారాకుల లోడ్‌పై ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు పడి ప్రమాదం సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. లేక నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 5 లక్షల నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు చెప్పారు. మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువుర్ని కంటతడి పెట్టించింది.