బీరువాలోని ఎస్‌ఆర్ రికార్డులను బయటకు తీసుకొస్తున్న సిబ్బంది
శ్రీకాకుళం , టెక్కలి: డివిజన్ కేంద్రమైన టెక్కలిలో గురువారం వేకువజామున 5 గంటల ప్రాంతంలో తహసీల్దారు కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఒక్క సారిగా చెలరేగి పక్కనే ఉన్న సబ్ ట్రెజరీ కార్యాలయానికి వ్యాపించాయి. దీనిని గమనించిన స్థానికులు వెంటనే తహసీల్దారు ఆర్.అప్పలరాజు, సిబ్బందికి సమాచారం అందజేశారు. వారు హుటాహుటిన కార్యాలయానికి చేరుకుని అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. దశాబ్దాల నాటి భవనం కావడంతో భారీ దుంగలు కిందకు పడుతుండడంతో లోపలకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. మరోవైపు దట్టమైన మంటలు వ్యాపించి కంప్యూటర్లు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. కొందరు సిబ్బంది మాత్రం అతికష్టమ్మీద లోపలకు వెళ్లి బీరువాలోని సర్వీస్ రిజిస్టర్లు బయటకు తీసుకువచ్చారు. అప్పటికే కొన్ని రిజిస్టర్లు స్వల్పంగా కాలిపోయాయి.
ఆర్‌ఐ రామారావుతో పాటు ఇతర సిబ్బంది మిగిలిన సామగ్రిను, రికార్డులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. సబ్ ట్రజరీ కార్యాలయం లోపల భాగంలో ఉన్న కంప్యూటర్లు, ఇతర రికార్డులను సకాలంలో బయటకు తీసుకువచ్చారు. అగ్ని మాపక సిబ్బందితో పాటు స్థానికులు కలిసి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. విలువైన ఆర్‌ఎస్‌ఆర్, ఎఫ్‌ఎంబీ, 1బీ, అడంగల్స్, ఎంఎల్‌సీ దరఖాస్తులు, కోర్టు ఫైళ్లతో పాటు తిత్లీ తుఫాన్‌కు సంబంధించి రికార్డులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని తహసీల్దారు అప్పలరాజు స్పష్టం చేశారు. అయితే ఎన్నికల విభాగానికి చెందిన కొన్ని దరఖాస్తులు కాలిపోయాయని, వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో సమస్య ఉండదని చెబుతున్నా రు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ల కిందట ఇదే మాదిరిగా స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించి కొన్ని రికార్డులు కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ చక్రధర్‌బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తహసీల్దారును అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment