
హత్యకేసులో నిందితుడిపై కాల్పులు
- పల్సర్ బైక్ మీద వచ్చి ఐదు రౌండ్లు కాల్చిన దుండగులు
- బాధితుడి శరీరంలోకి దూసుకెళ్లిన మూడు బుల్లెట్లు
సాక్షి, హైదరాబాద్: హత్యకేసులో నిందితుడి మీద దుండగులు కాల్పులు జరిపిన సంఘటన బుధవారం హైదరాబాద్‌లో సంచలనం కలిగించింది. బాధితుడి శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. దుండగులు వారు వచ్చిన మోటారు సైకిల్ మీదే పరారయ్యారు. బాధితుడు పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమికి చెందిన తూరపాటి నాగరాజు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోగల జింకలబావి కాలనీలో బుధవారం ఈ సంఘటన జరిగింది.
మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దుకాణం నుంచి చికెన్ కొనుక్కుని ఇంట్లోకి వెళుతున్న నాగరాజు బైక్ మీద అగంతకులు రావడాన్ని గమనించి గేటు వేసి ఇంట్లోకి పారిపోవాలని ప్రయత్నించాడు. ఆ సమయంలోనే బైక్ వెనకాల కూర్చున వ్యక్తి తపంచాతో నాగరాజుపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దానికి ఇంట్లోంచి వచ్చిన నాగరాజు కుమారుడు శివకృష్ణ రక్తం మడుగులో పడిపోయి ఉన్న తండ్రిని కారులో కిలోమీటరు దూరంలోని సాయిసంజీవిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు నాగరాజుకు ఆపరేషన్ చేసి నడుము కింది భాగంలో రెండు, కుడి తొడ భాగంలో ఒక బుల్లెట్‌ను బయటకు తీశారు. దీంతో నాగరాజుకు ప్రాణాపాయం తప్పింది.
స్పర్థల నేపథ్యంలో..
పినకడిమికి చెందిన నాగరాజు, భూతం గోవింద్ కుటుంబాల మధ్య స్పర్థల నేపథ్యంలో.. గత ఏడాది గోవింద్ సోదరుడు దుర్గారావు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నాగరాజు ప్రధాన నిందితుడు. ఈ కేసులో నిందితులైన గంధం నాగేశ్వరరావు, గంధం మారయ్య, పగిడి మారయ్య కోర్టుకు హాజరయ్యేందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి కారులో వెళుతుండగా పెదవుటపల్లి వద్ద దుండగులు కాల్చి చంపారు. అప్పటి నుంచి నాగరాజు భార్య, పిల్లలతో కలసి జింకలబావి కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అజ్ఞాతంలో ఉంటున్నాడు. తన పేరు సత్యనారాయణరాజు అని, జ్యోతిషం, వాస్తు చెబుతానని కాలనీ వాసులకు తెలిపాడు. నాగరాజు కుటుంబం ఆచూకీ కోసం వేటాడుతున్న ప్రత్యర్థులు ఎలాగో వారి ఆచూకీ కనుగొన్నారు.
భూతం శ్రీనివాస్ తదితరులే బాధ్యులు
యూకేలో ఉన్న భూతం గోవింద్ కిరాయి హంతక ముఠాతో తమను చంపాలని చూస్తున్నాడని నాగరాజు భార్య శ్రీదేవి చెప్పారు. ఈ కాల్పులకు గోవింద్ తమ్ముడు భూతం శ్రీనివాస్, బంధువులు కురాని గణేష్, కురాని కొండయ్య, బాలాజీలే బాధ్యులని ఆరోపించారు. తాము దుర్గారావును చంపలేదని, ఈ కేసులో తమను నిందితులుగా చేర్చడంతో పాటు చంపడం కూడా మొదలు పెట్టారని, ఇప్పటికే తన తండ్రి నాగేశ్వరరావు, తమ్ముడు గంధం మారయ్య, బంధువు పగిడి మారయ్యలను హత్యచేశారని చెప్పారు. ఇప్పుడు తన భర్తను చంపాలని చూస్తున్నారన్నారు. నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని కోరారు.
త్వరలో పట్టుకుంటాం : డీసీపీ తఫ్సీర్ ఎక్బాల్
నిందితులను గుర్తించి త్వరలో పట్టుకుంటామని ఎల్బీ నగర్ డీసీపీ తఫ్సీర్ ఎక్బాల్ తెలిపారు. ఘటనా స్థలాన్ని డీసీపీ తఫ్సీర్ ఎక్బాల్, ఇన్‌స్పెక్టర్ కె.నర్సింగ్‌రావు, క్లూస్‌టీం సభ్యులు పరిశీలించారు. నాగరాజు భార్య శ్రీదేవిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిందితులు బైక్‌పై వచ్చారని, డ్రైవ్ చేస్తున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నాడని, వెనకాల కూర్చున్న వ్యక్తి కాల్పులు జరిపాడని విచారణలో తేలింది. అగంతకులు కాల్పులకు ముందు ఏ రూట్‌లో వచ్చారు, తరువాత ఎలా పారిపోయారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఆయా రహదారుల్లోని సీసీ కెమెరాల పుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.