
చౌటుప్పల్: ప్రియుడి మోజులో పడిన ఓ భార్య కట్టుకున్నోడిని కడతేర్చింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడికే సుపారీ ఇచ్చి హత్యకు పన్నాగం పన్నింది. ఈ కేసులో మృతుడి భార్యతోపాటు ఆమె ప్రియుడు, అతని ముగ్గురు మిత్రులను అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో శుక్రవారం డీసీపీ రామచంద్రారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు.
ఆరేళ్ల క్రితం వివాహం
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం రాచాలకు చెందిన కమ్మరి నాగరాజు (35)కు బేగంపేటకు చెందిన జ్యోతి(22)తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి జీవన(4), యశ్వంత్(2) సంతానం. నాగరాజు కర్మన్‌ఘాట్‌లో కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే మూడు నెలల నుంచి భార్య జ్యోతిలో మార్పును గమనించిన నాగరాజు విషయాన్ని పసిగట్టాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. దీంతో భర్తను హత్య చేయాలని ఆమె పథకం రచించింది.
పెళ్లికి ముందే సంబంధం
వివాహానికి ముందు నాచారంలో జరిగిన బంధువుల వివాహానికి జ్యోతి వెళ్లింది. అక్కడ కార్తీక్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమ గా మారి, వివాహేతర బంధానికి దారి తీసింది. విషయం తెలిసిన జ్యోతి తల్లిదండ్రులు కూతుర్ని నాగరాజుకిచ్చి వివాహం చేశారు.
మూడు నెలల క్రితమే ఫోన్ నంబరు
జ్యోతి మూడు నెలల క్రితం ప్రియుడు కార్తీక్ సెల్ నంబరును సేకరించింది. అప్పటి నుంచి తరచూ మాట్లాడుతుండేది. అప్పుడప్పుడు నేరుగా వెళ్లి కలసి వచ్చేది. ఈ క్రమంలో భార్యకు కార్తీక్‌తో వివాహేతర సంబంధం ఉందని నాగరాజు గుర్తించాడు. పద్ధతి మార్చుకొమ్మని ఆమెను మందలించాడు.
పాలల్లో నిద్ర మాత్రలు కలిపి..
ఈ నేపథ్యంలో భర్త హత్యకు జ్యోతి పథక రచన చేసి.. దాని అమలు బాధ్యత ప్రియుడికి అప్పగించింది. ఇందు కు కొంత సుపారీని సైతం ఇచ్చిం ది. దీంతో కార్తీక్ గత నెల 30న నిద్రమాత్రలు తెచ్చి ఇచ్చాడు. వాటిని జ్యోతి పాలలో కలిపి భర్తతో తాగించింది. గాఢ నిద్రలో ఉండగా ప్రియుడికి ఫోన్ చేసింది. అతను మరో ముగ్గురు మిత్రులతో వచ్చాడు. వీరు అర్ధరాత్రి నాగరాజు ముఖంపై దిండు పెట్టి నులిమి హత్య చేశారు.
నాగరాజు చనిపోయాడని నిర్ధారించుకున్న ఆ ఐదుగురు.. మృతదేహాన్ని ఓ అద్దె కారులో వేసుకుని చౌటుప్పల్ మండలం జిల్లేడుచెల్క శివారులో చెట్ల పొదల్లో పడేసి వెళ్లారు. మరునాడు సాయంత్రం స్థానికులు చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన పద్ధతిలో విచారణ చేయగా విషయం వెల్లడైంది. దీంతో హత్యలో భాగస్వాములైన జ్యోతి (21)తోపాటు నాచారానికి చెందిన మహం కాళి కార్తీక్(22), అతని మిత్రులు మహ్మద్ యాసిన్ (19), నదియాల్ దీపక్(24), సిర్రప్ప నరేశ్(23)లను అరెస్టు చేశారు. రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ రామోజు రమేశ్, సీఐ నవీన్‌కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment