సాక్షి, హైదరాబాద్: సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టుల పరీక్ష పేపర్ లీకేజీ కేసులో దోషులుగా తేలిన నలుగురు సీఆర్‌పీఎఫ్ సిబ్బందితోపాటు మరో ప్రైవేటు ఉద్యోగికి శుక్ర వారమిక్కడి సీబీఐ కోర్టు ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష, రూ. 10 వేల చొప్పున జరిమానా విధించింది. 2004 జనవరి 7న జరిగిన ఈ లీకేజీ వ్యవహారంలో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది మహావీర్ సింగ్ (లాన్స్‌నాయక్), గోపీరాం, సూరజ్‌ఖాన్, ఆనంద్‌లతోపాటు సన్యాసిరావు అనే ప్రైవేటు ఉద్యోగిని కోర్టు ఈ మేరకు దోషులుగా తేల్చి, శిక్ష విధించింది. ప్రశ్నపత్రాన్ని టైప్ చేసేందుకుగాను సీఆర్‌పీఎఫ్ ఐజీ నాగరాజు ప్రశ్నలను డిక్టేట్ చేయగా.. స్టెనోగ్రాఫర్ సూరజ్‌ఖాన్ వాటిని లీక్ చేసినట్లు కోర్టు ధ్రువీకరించింది.
ప్రశ్నపత్రం లీకేజీ అనేది క్షమించరాని నేరమని, దీనివల్ల అర్హులైన అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురవుతారని తీర్పు సందర్భంగా సీబీఐ జడ్జి ఎంవీ రమేశ్ వ్యాఖ్యానించారు. కాగా పేపర్ లీకేజీ కావడంతో ఆ పరీక్ష రద్దు చేసి మళ్లీ వేరుగా నిర్వహించారు. ఇదిలాఉండగా.. 2007లో కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన జూనియర్ ఇంజనీర్ వీవీవీ ఎన్‌ఎస్‌ఎస్ ప్రసాద్‌కు సీబీఐ జడ్జి ఎన్.బాలయోగి ఏడాది జైలుశిక్ష, రూ. 13 వేల జరిమానా విధించారు.