ఐదు పంచాయతీలు విలీనం  | Five Panchayats Merge In GVMC | Sakshi
Sakshi News home page

ఐదు పంచాయతీలు విలీనం 

Published Sun, Dec 22 2019 8:26 AM | Last Updated on Sun, Dec 22 2019 8:27 AM

Five Panchayats Merge In GVMC - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మూడున్నర దశాబ్దాల కిందట నగర పాలక సంస్థగా ఏర్పడిన విశాఖ తొలి నుంచి రాజకీయపరంగా సంచలనంగానే ఉంటోంది. 1981లో జరిగిన తొలి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఆ తర్వాత 1987లో టీడీపీ, 1995, 2000లో కాంగ్రెస్‌ జయకేతనం ఎగరవేసింది. 2005లో కార్పొరేషన్‌ను మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ)గా మారుస్తూ అప్పటి ముఖ్యమంత్రి, దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి నగర రూపు రేఖలు మారిపోయాయి. ఆర్థిక రాజధానిగా అభివృద్ధిలో పరుగులు పెట్టింది. అప్పటి వరకూ ఉన్న 50 వార్డులు 72కి చేరాయి. గాజువాక, మధురవాడ, పెందుర్తి ప్రాంతాలు జీవీఎంసీలో  చేరాయి. గాజువాకను విలీనం చేసిన తర్వాత 72 వార్డులతో 2007లో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రానికి, నగరానికి మహానేత వైఎస్సార్‌ చేస్తున్న అభివృద్ధికి ఓటేస్తూ నగరవాసులు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గ గడువు 2012 ఫిబ్రవరి 26తో ముగిసింది. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు వెనకడుగు వేసింది. దీంతో.. అప్పటి నుంచి ప్రత్యేకాధికారి పాలనలోనే గ్రేటర్‌ విశాఖ కాలం గడపాల్సి వస్తోంది. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత మళ్లీ  ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

 5 పంచాయతీలు విలీనం చెయ్యండి 
అటు భీమిలిజోన్‌కు, ఇటు గ్రేటర్‌కు మధ్యలో ఉన్న ఐదు పంచాయతీలను విలీనం చేయకుండా గతంలో 81 వార్డుల విభజన పూర్తి చేశారు. అయితే.. గ్రేటర్‌ స్వరూపాన్ని పరిశీలిస్తే.. భీమిలి మున్సిపాలిటీకీ, జీవీఎంసీకి మధ్యలో  విలీనం కాని కాపులుప్పాడ, చేపలుప్పాడ, నిడిగట్టు, నగరపాలెం,జేవీ అగ్రహారం పంచాయతీలు ఉన్నాయి. దీంతీఓ గ్రేటర్‌ పరిధిలో ఈ పంచాయతీలో ద్వీపంలా కనిపిస్తాయి. అయితే.. వీటిని కలపాలని ప్రభుత్వ భావించి.. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఆయా పంచాయితీలన్నీ విలీనానికి అంగీకారం తెలపడంతో దానికి సంబంధించిన నివేదికను కొద్ది నెలల కిందట సీడీఎంఏకి జీవీఎంసీ పంపించింది. తాజాగా వార్డుల విభజన ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో ఆ ఐదు పంచాయతీలను కలుపుతూ వార్డు విభజన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు టౌన్‌ప్లానింగ్‌ సి బ్బంది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 23లోగా ప్రక్రియ పూర్తి చేసి సిద్ధం చేసిన డ్రాఫ్ట్‌ను తెలుగు, ఇంగ్లిష్‌ పత్రికల్లో నోటిఫికేషన్‌ ప్రచురించనుంది. దీంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, జోనల్‌ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు.  ఈ నెల 30 వరకు సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు.

రెండు వార్డుల సరిహద్దుల్లో మార్పులు? 
భీమిలి మండలంలోని ఐదు పంచాయతీలు విలీనం కానున్న నేపథ్యంలో ఆ జనాభా 50 వేలు దాటితేనే కొత్త వార్డు జత చెయ్యాలి. కానీ ఐదు పంచాయతీల మొత్తం జనాభా 19,116 మాత్రమే. దీంతో చుట్టు పక్కల వార్డుల్లో విలీనం చెయ్యనున్నారు. ఈ లెక్కన కేవలం రెండు వార్డుల సరిహద్దులు మాత్రమే మారనున్నాయని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం ఒకటో వార్డుతో పాటు 81 వార్డు సరిహద్దులు మారే అవకాశాలున్నాయని సమాచారం.

2011 జనాభా లెక్కల ప్రకారం... 
జీవీఎంసీ కమిషనర్‌ 2016 నవంబర్‌ 11న మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌కు గ్రేటర్‌ పరిధిలో ప్రస్తుత జనాభా వివరాలు, వార్డుల పునర్విభజన ప్రక్రియకు అవసరమైన సమాచారాన్ని పంపించారు. అందులో వివరాల ప్రకారం వార్డుల విభజన చేయాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఆ లెక్క ప్రకారం జీవీఎంసీ అధికారులు వార్డుల స్వరూపాలకు సంబంధించిన మ్యాపులను సిద్ధం చేస్తున్నారు.

ఈవీఎంలు సిద్ధం చేయాలని ఆదేశాలు 
వార్డుల విభజన, పంచాయతీల విలీన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం ఎన్ని పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేస్తారు.. వాటికోసం ఎన్ని ఈవీఎంలు అవసరం, అదనంగా ఎన్ని ఈవీఎంలు సిద్ధం చెయ్యాలి.. మొదలైన వాటన్నింటిపైనా ఇప్పటి నుంచే దృష్టి సారించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఈ మేరకు చినగదిలిలోని  ఈవీఎం గోదాముల్లో ఉన్న ఈవీఎం మెషీన్లని పరిశీలించే ప్రక్రియకు  రెండు రోజుల్లో శ్రీకారం చుట్టనున్నాం. జనవరి 10 కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈవీఎం మెషీన్లను సిద్ధం చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్టు జీవీఎంసీ కమిషనర్‌ జి. సృజన తెలిపారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement