ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
భువనేశ్వర్ ఒరిస్సా : స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రెండు ఎయిర్ ఇండియా విమానయాన సేవల్ని ఇటీవల రద్దు చేశారు. భువనేశ్వర్ నుంచి బెంగళూరు, బ్యాంకాక్ ప్రత్యక్ష విమానయాన సేవలు రద్దయ్యాయి. ఈ సేవల్ని తక్షణమే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ బాబుకు శుక్రవారం లేఖ రాశారు. 2010వ సంవత్సరం అక్టోబరు 30వ తేదీన స్థానిక విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
2017వ సంవత్సరం డిసెంబరు 10వ తేదీ నుంచి స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌కు ప్రత్యక్ష అంతర్జాతీయ విమానయాన సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ఇలా అంచెలంచెలుగా అంతర్జాతీయ విమానయాన సదుపాయాలు విస్తరిస్తారని ఊహిస్తుండగా కొనసాగుతున్న విమానయాన సేవల్ని రద్దు చేయడం అంతర్జాతీయ పర్యాటక రంగాన్ని ప్రభావితం చేస్తుంది.
సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంక వంటి ప్రపంచ దేశాలకు విమానయాన సదుపాయాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఆశించిన వర్గాలకు కొనసాగుతున్న విమాన సేవల్ని రద్దు చేయడం తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది.
బెంగళూరుకు స్వదేశీ విమాన సేవల్ని రద్దు చేయడంతో రాష్ట్రం నుంచి సాంకేతిక సమాచార వ్యవహారాల నేపథ్యంలో రాకపోకలు చేసే వర్గాలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడిందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. భువనేశ్వర్ నుంచి బ్యాంకాక్, బెంగళూరు ప్రాంతాలకు ఇటీవల రద్దు చేసిన ఎయిర్ ఇండియా విమాన సేవల్ని తక్షణమే పునరుద్ధరించడంలో ప్రత్యక్షంగా చొరవ కల్పించుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ బాబుకు రాసిన లేఖలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment