కృష్ణా పుష్కరాలపై దృష్టి సారించండి
జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్
సాగర సంగమ ప్రాంతం పరిశీలన
కోడూరు : కృష్ణా పుష్కరాలపై జిల్లా పోలీసు యంత్రాంగం ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ కె.విజయకుమార్ సూచించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పవిత్ర కృష్ణా సాగర సంగమ ప్రదేశాన్ని ఎస్పీ స్థానిక పోలీసులతో కలిసి శనివారం పరిశీలించారు. విజయవాడ దగ్గర నుంచి హంసలదీవి వరకు కృష్ణానది వెంట ఉన్న ఘాట్లు వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. దేవాలయాల వద్ద కూడా పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. విజయవాడ, వేదాద్రి, ముక్త్యాల, శ్రీకాకుళం, పెదకళ్లేపల్లి, హంసలదీవి ఘాట్ల వద్ద భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోందని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆయన ఆదేశించారు. హంసలదీవిలోని సాగర సంగమం వద్ద లోతు అధికంగా ఉన్నందున ప్రత్యేక దృష్టిసారించాల్సి ఉంటుందని అవనిగడ్డ డీఎస్పీ ఖాదర్‌బాషా ఎస్పీకి వివరించారు. సంగమం వద్దకు నూతన రహదారి ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదించారని, దీంతో భక్తులు ఈ ప్రాంతానికి అధిక సంఖ్యలో తరలి వస్తారని డీఎస్పీ పేర్కొన్నారు.
ముమ్మర గస్తీ నిర్వహించాలి
పాలకాయతిప్పలోని సముద్రం తీరం వెంట ముమ్మర గస్తీ నిర్వహించి, ప్రతి నిత్యం పరిస్థితులను తనకు వివరించాలని స్థానిక పోలీసులను ఎస్పీ ఆదేశించారు. సాగర సంగమం ప్రాంతంలో ప్రత్యేక బోటుపై ప్రయాణించి సముద్ర స్థితిగతులను పరిశీలించారు. అనంతరం హంసలదీవిలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఐ చంద్రశేఖర్, కోడూరు, అవనిగడ్డ ఎస్.ఐలు వై.సుధాకర్, డి.వెంకటకుమార్ ఉన్నారు.