
అన్నింటికీ ఆధారే
సంక్షేమ పథకాలకు ఆధార్‌ను వర్తింపజేయడాన్ని గతంలో వ్యతిరేకించిన టీడీపీ.. ప్రస్తుతం అన్నింటికీ ఆధార్‌తో ముడిపెడుతోంది.
అనంతపురం సప్తగిరి సర్కిల్ : సంక్షేమ పథకాలకు ఆధార్‌ను వర్తింపజేయడాన్ని గతంలో వ్యతిరేకించిన టీడీపీ.. ప్రస్తుతం అన్నింటికీ ఆధార్‌తో ముడిపెడుతోంది. గతంలో ఆధార్ ఆధారంగా గ్యాస్‌కు ‘నగదు బదిలీ’ వర్తింప చేయడంతో చాలా మందికి సబ్సిడీ డబ్బు బ్యాంకు ఖాతాలో జమకాక ఇబ్బంది పడ్డారు.
తిరిగి ఇప్పుడు సంక్షేమ పథకాలన్నింటికీ అదే ‘ఆధార’ం కానుంది. లేదు లేదంటూనే ఆధార్ నంబర్ ఇస్తేనే రేషన్, ఉపాధి కూలి, పక్కా గృహం బిల్లు మంజూరవుతాయని అధికారులు అంటున్నారు. దీంతో ఆయా శాఖల అధికారులు లబ్ధిదారుల నుంచి ఆధార్ నంబర్లను సేకరిస్తున్నారు. ఉపాధి హామీ కూలీలకు, పింఛన్‌దారులకు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు, జననీ సురక్ష యోజన (జేఎస్‌వై) లబ్ధిదారులకు, కొత్త గ్యాస్ కనెక్షన్‌కు, చివరకు రైతు రుణ ఖాతాలకూ ఆధార్ నంబర్‌నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. తొలుత ఉపకార వేతనాలు పొందే విద్యార్థులకు ఇప్పటికే ఆధార్ వివరాలు, బ్యాంక్ ఖాతాలు ఉన్న వారికి వర్తింప చేస్తున్నారు.
‘జిల్లాలో 42 లక్షల మంది ఆధార్ తీయించుకున్నారు. 39.05 లక్షల మందికి ఆధార్ జనరేట్ అయింది. 2.95 లక్షల మంది ఆధార్ తీయించుకోవాల’ని అధికారులు చెబుతున్నారు. అయితే ఇది వాస్తవం కాదని, చాలా మందికి ఆధార్ కార్డులు అందలేదని తెలుస్తోంది.
ఆధార్ నంబర్ ఉంటేనే రేషన్..
చౌక దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా రేషన్ పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 38 లక్షల మంది పేదలు ప్రతి నెలా రేషన్ తీసుకుంటున్నారు. వీరిలో ఇప్పటికి 28.67 లక్షల మంది నుంచి ఆధార్ నంబర్ సేకరించి అనుసంధానం పూర్తి చేశారు. ఆగస్టు నుంచి ఆధార్ నంబర్ ప్రాతిపదికనే రేషన్ అందజేయనున్నారు.
గ్యాస్ కనెక్షన్ కావాలంటే..
కొత్తగా గ్యాస్ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకునే వారికి ఆధార్ తప్పనిసరి అని నిబంధన పెట్టా రు. గతంలో కనెక్షన్ తీసుకున్న వారి నుంచి కూ డా ఆధార్ సేకరించారు. గ్యాస్ కనెక్షన్ ఒరిజినల్ అని నిరూపించుకోవాలంటే ఆధార్ నంబర్ చూపించాల్సిందే. జిల్లాలో 5.20 లక్షల గ్యాస్ వినియోగదారుల నుంచి ఆధార్ సేకరించారు.
‘ఇందిరమ్మ’ కూ..
ఇందిరమ్మ పథకం కింద ప్రస్తుతం కొత్తగా ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకోనే వారితో పాటు, గతంలో ఇల్లు మంజూరై పూర్తి చేసుకున్న వారి నుంచి కూడా అధికారులు ఆధార్ నంబర్లు సేకరిస్తున్నారు.
ఉపాధి కూలికి సైతం
ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 7.50 లక్షల మందికి జాబ్ కార్డులున్నాయి. వీరందరికీ ఆధార్ నంబర్ ప్రాతిపదికనే చెల్లింపులు చేపడుతున్నారు. అలాగే 4.08 లక్షల మందికి కూడా ఆధార్ నంబర్ ఆధారంగానే పింఛన్ అందజేసే ప్రయత్నాలు చేపడుతున్నారు.
స్కాలర్‌షిప్ అందాలన్నా..
జిల్లాలో వివిధ స్థాయిలలో చదువుకుంటున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందాలన్నా ఆధార్ నంబర్ ప్రాతిపదికనే అందజేస్తున్నారు. గత ఏడాది నుంచి దీన్ని అమల్లోకి తీసుకువచ్చారు. 95 వేల మంది విద్యార్థులకు దీన్ని అమలు చేస్తున్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించాలి
సంక్షేమ పథకాలకు తిరిగి ఆధార్ నంబర్ ప్రతిపాదనను తీసుకురావడం సరికాదు. ఆధార్ కార్డులు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు చెప్పినా మళ్లీ దాన్ని ప్రభుత్వ పథకాలకు ముడిపెట్టాలని యత్నించడం అన్యాయం. గత ప్రభుత్వాలు చేసిన తప్పే ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్నాయి.
- ఆదినారాయణ, వ్యాపారి, అనంతపురం
తిరిగి కష్టాలు తప్పవు..
రేషన్, గ్యాస్, ఇంటి మంజూరు తదితర వాటికి ఆధార్ నంబర్‌తో ముడిపెట్టడం వల్ల మహిళలకు కష్టాలు తప్పవు. సబ్సిడీలు సరిగా అందక వాటి కోసం పనులన్నీ మానుకొని తిరగాల్సివస్తుంది. ఆధార్ విషయాన్ని ప్రభుత్వం పునరాలోచించాలి.
- హేమావతి, గృహిణి, అనంతపురం
ఆధార్ నంబర్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం
సంక్షేమ పథకాలన్నింటికీ ఆధార్ నంబర్ తప్పనిసరి కావడంతో ఆధార్ నంబర్లు అందనివారికివెంటనే అందజేసేలా చర్యలు చేపట్టాం. 55 మీసేవా కేంద్రాల ద్వారా, 12 ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా ఆధార్ తీయించుకునే వెసులుబాటు కల్పించాం. 2012 డిసెంబర్‌లోపు ఆధార్ తీయించుకుని కార్డులు ఇంకా అందకుండా ఉన్నట్లయితే అలాంటి వారు మళ్లీ తీయించుకోవాలి.
- ఉమామహేశ్వర్‌రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్‌ఓ)