న్యూస్‌లైన్, పీలేరు : పేదల పెన్నిధిగా గుర్తింపు పొందిన భారత కమ్యూనిస్టు పార్టీ యోధుడు, పీలేరు మాజీ ఎమ్మెల్యే సీకే. నారాయణరెడ్డి(85) ఇకలేరన్న వార్త పీలేరు ప్రజలను కలచివేసింది. 1962 నుంచి 1967 వరకు పీలేరు ఎమ్మెల్యేగా పని చేసిన నారాయణరెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొం దుతూ శుక్రవారం పరమవదించారు. రొంపిచెర్ల క్రాస్ చల్లావారిపల్లెకు చెందిన నారాయణరెడ్డి భారత కమ్యూనిష్టు పార్టీ తరపున పీలేరు నియోజకవర్గం నుంచి 1962లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు.
తన పదవీ కాలంలో పేదల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారు. పీలేరు పట్టణంలోని ఉన్నత పాఠశాల అభివృద్ధికి కృషిచేయడంతోపాటు పేద విద్యార్థుల కోసం మొట్టమొదటిసారిగా హాస్టల్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అవసరమైన ఆహార పదార్థాలను దాతల నుంచి సేకరించి హాస్టల్‌ను నిర్వహించేవారు. ఆయన సతీమణి జయప్రద బీఎడ్ సైన్స్ అసిస్టెంట్ పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేసి ఎందరో విద్యార్థులకు విద్యాదానం చేసి ఆదర్శ ఉపాధ్యాయినిగా గుర్తింపు పొందారు. రాజకీయ నేతల ఒత్తిళ్ల ప్రభావంతో పదేపదే బదిలీలకు గురవుతుండడంతో మనస్తాపం చెంది ఉద్యోగానికి రాజీనామా చేశారు.
అనంతరం భార్యభర్తలు హైదరాబాద్‌లో స్థిరపడి అక్కడ పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి విద్యాసంస్థ ఏర్పాటు చేశారు. దీంతోపాటు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పేరుతో అనేక సాహితీ ప్రచురణలను ముద్రించి సామాన్య పాఠకులకు తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చారు. స్వతహాగా ఆయనిది జమీందారీ కుటుంబం అయినప్పటికీ తన ఆస్తులన్నీ పేదలకు దానం చేశారు. నారాయణరెడ్డికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు గౌతమ్, కోడలు ఇరువురూ వైద్యవృత్తిని స్వీకరించి మదనపల్లెలో వైద్యసేవలందించేవారు.
90వ దశకంలో బెంగళూరులో జరిగిన సార్క్ సమావేశాలకు హాజరై తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పెద్ద కుమార్తెను అనంతపురంలో ఇచ్చి వివాహం చేశారు. రెండో కుమార్తె హైదరాబాద్ డాక్టర్ వృత్తిలో ఉన్నారు. ఆమె వద్ద వృద్ధ దంపతులు ఉంటున్నారు. సీకే. నారాయణరెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే శాసనమండలి సభ్యులు యండ పల్లె శ్రీనివాసులురెడ్డి, చిత్తూరు జిల్లా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వి. సిద్దరామిరెడ్డి తదితరులు హైదరాబాద్‌లో నారాయణరెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
మాజీ ఎమ్మెల్యే సీకే నారాయణ రెడ్డి కన్నుమూత
Published Sat, Sep 7 2013 4:33 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
Advertisement
Advertisement