ఆశగా ఆకాశం వైపు..
అరండల్‌పేట(గుంటూరు): ఖరీఫ్ అదను దాటిపోతున్నా చినుకుజాడ లేదు. అదిగో ఇదుగో అంటూ ఊరిస్తున్న రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయో కూడా తెలియడంలేదు. రోజూ ఊరిస్తున్నట్టు మేఘాలు వస్తున్నాయి.. అంతలోనే ముఖం చాటేస్తున్నాయి. రోజు దాటేకొద్దీ రైతుల్లో ఆందోళన ఎక్కువవుతోంది. దుక్కి దున్ని పంట వేయాల్సిన రైతన్న ఆకాశం వైపు ఆశగా చూస్తున్నాడు. సకాలంలో వర్షాలు పడితే ఈపాటికే దుక్కులు దున్నుకుని భూమి చదును చేసుకోవాల్సి ఉంది. సాధారణంగా జూన్ తొలి వారంలోనే తొలకరి మొదలవుతుంది. ఇప్పటి వరకు వర్షాలు లేకపోవడంతో నిత్యం వరుణదేవుడి కరుణ కోసం పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. గ్రామదేవతలకు గంగాభిషేకం చేస్తున్నారు. వేపాకుల మధ్య కప్పలను ఊరేగిస్తూ వానలు కురవాలి.. వరి చేలు నిండాలి అంటూ ఊరేగింపు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో 72 శాతం నల్లరేగడి భూములే..
జిల్లాలో రైతులు సాగుచేసుకుంటున్న భూముల్లో 72 శాతం వరకు నల్లరేగడి భూములే ఉన్నాయి. ఈ భూముల్లో నీటి నిల్వ సామర్ధ్యం అధికంగా ఉంటుందని, కాబట్టి వివిధ రకాల వ్యవసాయ పంటలు సాగు చేస్తుంటారు. ఇవి ఉద్యాన పంటలు వేసుకునేందుకు అనువుగా ఉండవు. 17 శాతం ఉన్న ఎర్రరేగడి భూముల్లో ఉద్యాన పంటలు ఎక్కువగా సాగుచేస్తుంటారు.
ఈ భూముల్లో నీటి నిల్వ సామర్ధ్యం తక్కువ. పండ్లతోటలకు అనువుగా ఉంటాయి. జిల్లాలో 9 శాతంగా ఉన్న ఇసుక నేలల్లో మాత్రం వేరుశనగ వంటి పంటలు మాత్రమే వేస్తుంటారు. మరే ఇతర పంటలకు అనువుకాదు. ఇక జిల్లాలో కేవలం రెండు శాతం మాత్రమే ఉన్న అల్లూవియల్ నేలలు (ఒండ్రు నేలలు) పంటల అధికోత్పత్తులకు బాండాగారాలు లాంటివి. అన్ని రకాల పంటలు పండించుకునేందుకు ఈ నేలలు అనువుగా ఉంటాయి.
వర్షాధార భూములు 2.6 లక్షల హెక్టార్లు...
జిల్లాలో భౌగోళిక విస్తీర్ణం 11.39 లక్షల హెక్టార్లు కాగా, ఈ మొత్తంలో 6.17 లక్షల హెక్టార్ల విస్తీర్ణం వివిధ పంటల కింద సాగుబడి ఉంది. వివిధ నీటి వసతుల కింద 5.34 లక్షల హెక్టార్ల విస్తీర్ణం సాగవుతుండగా 2,06,250 హెక్టార్ల భూమి కేవలం వర్షాధారంపై ఆధారపడి సాగవుతోంది. ఈ ఖరీఫ్ కింద ప్రతిపాదించిన సాధారణ సాగు విస్తీర్ణం 5.65 లక్షల హెక్టార్లు. 5.86 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగుచేసేలా ప్రతి ఏడాది వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
జిల్లాలో 2,66,574 హెక్టార్లలో వరి సాధారణ విస్తీర్ణం కాగా 2,85,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేస్తారు. అలాగే కంది సాధారణ విస్తీర్ణం 26,838 హెక్టార్లు కాగా 50 వేల హెక్టార్లలో సాగులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. పత్తి సాధారణ విస్తీర్ణం 1,50,586 హెక్టార్లు కాగా అదే స్థాయిలో రైతులను ప్రొత్సహించాల్సి ఉంది. మిరప పంట విషయానికొస్తే 57,294 హెక్టార్లు సాధారణ విస్తీర్ణమైతే 70 వేల హెక్టార్లలో మిరప సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇత ర పంటల విషయానికొస్తే 63,863 హెక్టార్ల సాధారణ విస్తీర్ణమైతే 41,200 హెక్టార్లలో వివిధ పంటలు సాగును చేయాల్సి ఉంది.
రైతుల ఆశలపై నీళ్లు.: నిత్యం పొలం పనుల్లో బిజీగా గడపడమే అన్నదాతలకు ఆనందం. పండుగలు, పబ్బాలకు మినహా మిగతా అన్ని రోజులూ పొలాల్లో ఏదోక పనిచేస్తూ కనిపిస్తుంటారు కర్షకులు. ఫిబ్రవరి, మార్చి నాటికి అన్ని పంటలను ఇళ్లకు చేర్చుకుని ఏప్రిల్ నెలలో తాము పండించిన ఉత్పత్తులను విక్రయించుకునే పనిలో పడతారు. ఏప్రిల్, మే మాసాల్లో తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు అమ్ముకోగలిగితేనే తిరిగి ఖరీఫ్ సాగు సజావుగా సాగుతుంది. ఈసారి రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు రాలేదు. దీనికి తోడు తుపాన్లు, వరదల ప్రభావంతో రైతు కుదేలైపోయాడు. ఇప్పటి వరకు నష్టపోయిన పంటకు నష్టపరిహారం సైతం అందలేదు. ఈ ఏడాదైనా వర్షాలు కురిస్తే నష్టాన్ని పూడ్చుకోవచ్చన్న రైతుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.