నైరుతి రుతుపవనాలు.. ముందుగానే పరుగెత్తుకొస్తున్నాయి. అక్కడక్కడ చిరుజల్లులు పడుతుండటంతో ఖరీఫ్‌కు సాగుకు సిద్ధమైన రైతులు ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు.
పాలమూరు, న్యూస్‌లైన్: నైరుతి రుతుపవనాలు.. ముందుగానే పరుగెత్తుకొస్తున్నాయి. అక్కడక్కడ చిరుజల్లులు పడుతుండటంతో ఖరీఫ్‌కు సాగుకు సిద్ధమైన రైతులు ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే అదనుగా భావించిన సర్కారు, తయారీసంస్థలు విత్తనాల ధరలు పెంచేశాయి. గతేడాది కరువు పరిస్థితులను అధిగమించిన పాలమూరు రైతులు విత్తనధరల పెంపుతో సంకటపరిస్థితులనే ఎదుర్కొనున్నారు.
సబ్సిడీ విత్తనాల ధరలు పెంచి రైతులపై భారం మోపేందుకు సిద్ధమవుతోంది. వర్షాలు ఆశాజనకంగా ఉంటే జిల్లాలో 7.19 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పదిరోజుల క్రితం విత్తనధరను క్వింటాలుపై రూ.400 నుంచి రూ.600 వరకు పెంచడంతో రైతులపై దాదాపు రూ.20కోట్ల వరకు అదనపు భారం పడనుంది. జిల్లాలో అత్యధికంగా సాగవుతున్న పత్తి.. విత్తనధరలు పెరగకపోవడంతో రైతులు ఊరట చెందినా.. మిగిలిన పంటలు సాగుచేసే రైతులు పెరిగిన ధరల కారణంగా అదనపు భారం మోయాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా 7.19లక్షల హెక్టార్లలో ఆయా పంటలసాగు అంచనా ప్రకారం ఈ ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 65వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కానున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో వేరుశనగ సాగుపై రైతులు దృష్టిసారిస్తున్నారు. జిల్లాలో 1.20లక్షల హెక్టార్లలో వేరుశనగను సాగుచేయనున్నట్లు అంచనాలు వేస్తున్నారు. అయితే వేరుశనగ క్వింటాలుపై రూ.650 ధర పెంచినా సబ్సిడీని కూడా రూ.1850 నుంచి రూ.2100కు పెంచింది. అయినప్పటికీ క్వింటాలుపై రూ.400 అదనపు భారం పడుతోంది. ఈ చొప్పున ప్రభుత్వం పంపిణీ చేసే విత్తనాలపైనే రైతులు దాదాపు రూ.2.5 కోట్ల అదనపు భారం మోయాల్సి వస్తోంది. మిగిలిన విత్తనాలను రైతులు బహిరంగ మార్కెట్‌లో కొనాల్సిన పరిస్థితి. ప్రభుత్వమే ధర పెంచడంతో వ్యాపారులు కూడా ఆ దిశగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అదే జరిగితే రైతులపై భారం రూ.7.5 కోట్లకు చేరుకోనుంది. ప్రస్తుతం మార్కెట్‌లో వేరుశనగ విత్తనాల ధర క్వింటాలు రూ.3,300 నుంచి ఐదువేలు పలుకుతోంది. అయితే ప్రభుత్వం క్వింటాలు ధర రూ.6350గా నిర్ణయించడం గమనార్హం.
వరి రైతుల్లో ఆందోళన
జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం దాదాపు 1.95 లక్షల హెక్టార్లు కాగా.. 25వేల క్వింటాళ్ల వరి విత్తనం అవసరం కానుంది. ఇందులో ప్రభుత్వం దాదాపు ఎనిమిది వేల క్వింటాళ్లు సబ్సిడీపై పంపిణీచేసే అవకాశం ఉంది. ప్రభుత్వం విత్తనధరను క్వింటాలుపై రూ.2200 నుంచి రూ.2800 వరకు పెంచడంతో రైతులపై రూ.5.40 కోట్ల అదనపుభారం పడనుంది. మిగిలిన విత్తనాలను మార్కెట్‌లో కొనాల్సి ఉండటం.. అక్కడా ధర పెరిగితే మరో రూ.2.50 కోట్లు అన్నదాతలకు భారం పడుతుంది.
కందులు..
గతేడాది కందుల ధర క్వింటాలుకు రూ.5200 సబ్సిడీ రూ.2600 పోను రైతులు రూ.2600 చెల్లించేవారు. ఈసారి ప్రభుత్వం క్వింటాలుపై రూ.600.. సబ్సిడీని రూ.300కు పెంచింది. దీంతో రైతులపై రూ.300అదనపు భారం పడుతోంది. జిల్లాలో దాదాపు 99వేల హెక్టార్లలో పంట సాగవుతుండటంతో 2,150 క్వింటాళ్ల విత్తనం అవసరమవుతోంది. దాదాపు రూ.ఆరులక్షలు రైతులపై భారం పడనుంది. భూములను సారవంతం చేసేందుకు సాగుచేసే జీలు, పప్పు దినుసులైన మినుముల ధరను కూడా రూ.300పెంచిన ప్రభుత్వం మొక్కజొన్న, జొన్న, సజ్జ, పొద్దు తిరుగుడుపై సబ్సిడీని క్వింటాలుకు రూ.2500లకే పరిమితం చేసింది.