కదిరి : రెవెన్యూ అధికారుల సహకారంతో అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తమ భూముల కబ్జాకు యత్నిస్తున్నాడని, ఆయనకు పేదల భూములే కావాల్సి వచ్చాయా? అని కుటాగుళ్లకు చెందిన కొందరు బాధితులు మండిపడ్డారు.
ఆ గ్రామం వద్ద జాతీయ రహదారిపై బుధవారం వారు గంట పాటు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. బాధితులు మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కనే సర్వే నంబర్ 403, 404లో ఎన్నో ఏళ్లుగా తమకు భూమి ఉందన్నారు. తహశీల్దార్ నాగరాజు, ఆర్‌ఐల సహకారంతో కందికుంట ఈ భూమిని కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల మున్సిపల్ చైర్‌పర్సన్ సురయాభాను భర్త బాబ్జాన్, మరి కొందరు టీడీపీ నాయకులు వచ్చి తమ స్థలంలో ప్రవేశించారని ఆందోళన వ్యక్తం చేశారు.
భూమికి సంబంధించి తమ వద్ద పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఉన్నాయన్నారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించినా ఆ భూమి ఎవరి పేరుమీద ఉందో తెలిసిపోతుందన్నారు. కదిరి తహశీల్దార్ కార్యాలయంలో పేదలకు న్యాయం జరగదని, తహసిల్దార్, ఆర్‌ఐలు ఇద్దరూ మాజీ ఎమ్మెల్యే కందికుంట చెప్పినట్లే నడుచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాస్తారోకోతో వాహనాల రాకపోకలు స్తంబించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీ కత్తుపై విడుదల చేశారు. రాస్తారోకో చేసిన వారిలో నాగరాజు, ఖాదర్‌బాషా, సాయినాథ్ ఇంకా పలువురు మహిళలు ఉన్నారు.
పేదల భూములే కావాలా?
Published Thu, Jun 18 2015 2:58 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM
Advertisement