ఇబ్రహీంపట్నం/కంచికచర్ల (మైలవరం): పట్టిసీమ కాలువ కృష్ణా నదిలో కలిసే పవిత్ర సంగమం వద్ద మరో విషాదం చోటుచేసుకుంది. స్నానం చేసేందుకు వచ్చిన నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు శనివారం మధ్యాహ్నం ఇక్కడ గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో ఉన్న మిక్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్, మెకానికల్ విభాగాల్లో రెండో సంవత్సరం చదువుతున్న తిరువూరుకు చెందిన నర్సింగ్ శ్రీనాథ్(19), గుంటూరు జిల్లా చౌపాడుకు చెందిన కారుకట్ల ప్రవీణ్(18), కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రంగాపురానికి చెందిన కుప్పిరెడ్డి నాగచైతన్యరెడ్డి(19), విజయవాడ కొత్తపేటకు చెందిన పిల్లా రాజ్‌కుమార్(19), పశ్చిమగో దావరి జిల్లాకు చెందిన గురజాల సాయిరామ్ పవిత్ర సంగమం వద్దకు వచ్చారు. ప్రవీణ్, శ్రీనాథ్ కళాశాల హాస్టల్‌లో ఉంటున్నారు.
మిగిలిన వారు బయట రూమ్‌లో ఉంటున్నారు. సాయిరామ్ మినహా మిగిలిన నలుగురు కాలువ కలిసే ప్రాంతంలో స్నానానికి దిగారు. శ్రీనాథ్ గ్రిల్స్‌పైకి ఎక్కి విన్యాసాలు చేస్తున్న సమయంలో పట్టుతప్పి కాలువలోకి జారిపోయాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో ప్రవీణ్, చైతన్య, రాజ్‌కుమార్ ఒక్కొక్కరుగా నీటిలో కొట్టుకునిపోయారు. ప్రత్యక్షసాక్షిగా ఉన్న సాయిరామ్ తన తోటి వారిని కాపాడాలని అక్కడ ఉన్నవారిని వేడుకున్నా నీటి ఉధృతిని చూసి ఎవ్వరూ సాహసించలేదు. వారు చూస్తుండగానే విద్యార్థులు మునిగిపోయారు. ప్రమాదం విషయం తెలిసి స్థానికులు, కళాశాల విద్యార్థులు సంగమం ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద గతేడాది నవంబర్‌లో బోటు బోల్తాపడి 22 మంది మృత్యువాత పడ్డ విషయం విదితమే. ఇపుడు అదే ప్రాంతంలో నలుగురు విద్యార్థులు గల్లంతుకావడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
ముమ్మరంగా గాలింపు..
విద్యార్థులు గల్లంతైన సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక మత్స్యకారులు, గజఈతగాళ్లు సంగమం వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ఉధృతి అధికంగా ఉండటంతో గాలింపు చర్యలు కష్టంగా మారాయి. తొలుత పట్టిసీమ కాలువలో బోట్లు, వలలతో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అనంతరం కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి వరకూ వెతికినా గల్లంతైన వారి జాడ లభ్యం కాలేదు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఇన్‌చార్జి కలెక్టర్ విజయకృష్ణన్, సీపీ గౌతమ్‌సవాంగ్, డీసీపీ క్రాంతి రాణా, డీసీపీ నవాజ్‌జానీ ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక అధికారులు, విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కాగా, తమ తోటి విద్యార్థులు గల్లంతయ్యారు అన్న విషయం తెలుసుకుని ప్రమాదం జరిగిన ప్రాంతానికి కళాశాల విద్యార్థులు భారీగా చేరుకున్నారు. సహచర విద్యార్థి సాయిరామ్ ద్వారా విషయాన్ని తెలుసుకుని దుఖఃసాగరంలో మునిగిపోయారు. గల్లంతైన వారు క్షేమంగా రావాలని దేవుళ్లకు మొక్కుకున్నారు.
ప్రభుత్వ వైఫల్యంపై ప్రజాగ్రహం..
గోదావరి జలాలు పట్టిసీమ కాలువ ద్వారా పవిత్ర సంగమం వద్దకు నాలుగు రోజుల కిందట చేరాయి. జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఇక్కడ పూజలు కూడా చేశారు. ఈ ప్రాంతానికి రోజూ వందలాది మంది వస్తున్నా.. కనీస భద్రతా చర్యలు చేపట్టలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. బోటు బోల్తా సంఘటన తర్వాత అయినా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడుతున్నారు. కాలువకు నీళ్లు వదిలామని ప్రచారం చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై పెట్టడంలేదని ధ్వజమెత్తుతున్నారు. ప్రమాదకర ప్రాంతమైనా కనీసం హెచ్చరిక బోర్డులుగానీ, సూచికలుగానీ ఇక్కడ ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.
వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ
వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గం సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ అమెరికా నుంచి బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంఘటన దరదృష్టకరమన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు సలాం బాబు, డి.అంజిరెడ్డి, జి.కొండూరు జెడ్పీటీసీ సభ్యుడు కాజా బ్రహ్మయ్య, ఇబ్రహీంపట్నం మండల కన్వీనర్ బొమ్మసాని వెంకటచలపతి, పార్టీ నాయకులు లంకే అంకమోహనరావు, జోగి రాము తదితరులు బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గాలింపు చర్యలకు తమవంతు సహకరించారు.
మిక్ యాజమాన్యంపై ఆగ్రహం..
మిక్ కళాశాల యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రుల మండిపడుతున్నారు. కళాశాలలో క్రమశిక్షణ కొరవడిందని, ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నా విద్యార్థులపై ఎటువంటి శ్రద్ధ పెట్టడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల హాస్టల్ నుంచి విద్యార్థులు బయటకు వెళ్లేందుకు అనుమతి ఎలా ఇచ్చారని, కళాశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment