వేర్వేరుగా జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. హైదరాబాద్‌లో దాబాపై నుంచి పడి బాలుడు, ఇటిక్యాలలో పాముకాటుకు మహిళ
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
Published Thu, Sep 19 2013 2:00 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
వేర్వేరుగా జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. హైదరాబాద్‌లో దాబాపై నుంచి పడి బాలుడు, ఇటిక్యాలలో పాముకాటుకు మహిళ, డోంగర్‌గాంలో అతిగా మద్యం తాగి వ్యక్తి, పట్నాపూర్ ధామాజీ వాగులో పడి మహిళ మృతిచెందారు.
పాముకాటుకు మహిళ..
లక్సెట్టిపేట, న్యూస్‌లైన్ : మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన కన్నం భాగ్య(45) పాముకాటుకు మృతిచెందింది. ఎస్సై ఎస్‌కే.లతీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. భాగ్య గ్రామ స్టేజీ వద్ద హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. బుధవారం హోటల్‌లో చెత్త శుభ్రం చేస్తుండగా పాముకాటు వేసింది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు.
వాగులో పడి..
జైనూర్/నార్నూర్ : మండలంలోని పట్నాపూర్ ధమాజీ వాగులో పడి మహిళ మృతిచెందింది. జైనూర్ ఎస్సై కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. నార్నూర్ మండలం నాగలకొండ పంచాయతీ పరిధి వాగుతండా గ్రామానికి చెందిన జైవంతబాయి(37) వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా పట్నాపూర్ ధమాజీ వాగు పొంగి పొర్లింది. వాగు దాటే క్రమంలో నీటిలో కొట్టుకుపోయింది. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించగా శవం లభ్యమైంది. ఆమెకు భర్త విఠల్ ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
హైదరాబాద్‌లో..
కుభీర్ : మండలంలోని డోడర్న తండా-2కు చెందిన జాదవ్ రేష్మా, సంతోష్(కానిస్టేబుల్) దంపతుల కూమారుడు సిద్ధార్థ్(3) హైదరాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం మృతిచెందాడు. సంతోశ్ గణేశ్ నవరాత్రుల బందోబస్తు కోసం విశాఖపట్నం వెళ్లగా.. తల్లి ఇంట్లో పనులు చేసుకుంటోంది. సిద్ధార్థ్ ఇతర పిల్లలతో కలిసి దాబాపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మూడవ అంతస్తు నుంచి కిందపడ్డాడు. వెంటనే కార్పొరేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతదేహాన్ని బుధవారం హైదరాబాద్ నుంచి డోడర్నతండాకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, సంతోష్‌కు కూతురు, కుమారుడు ఉండగా.. కుమారుడి మరణంతో తండాలో విషాదం నెలకొంది.
అతిగా మద్యం తాగి వ్యక్తి..
వాంకిడి : అతిగా మద్యం సేవించిన వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని సవాతి గ్రామ పంచాయతీ పరిధి డోంగర్‌గాంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్‌కు చెందిన అబ్దుల్ అజీజ్(45) మంగళవారం అల్లమురబ్బ(మిఠాయి) విక్రయించడానికి డోంగర్‌గాం గ్రామానికి వెళ్లాడు. వ్యాపారం ముగించుకునేసరికి సాయంత్రం, అటవీ ప్రాంతం కావడంతో అక్కడే బస చేశాడు. అతిగా మద్యం సేవించి ఓ ఇంటి ముందు నిద్రించాడు. బుధవారం ఉదయం నిద్ర లేవకపోవడంతో మృతిచెందాడని గ్రామస్తులు గుర్తించారు. సర్పంచ్ భీంరావు, గ్రామస్తులు వాంకిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement