యూసీఐఎల్ కాలయాపన
వేముల : తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టుకు నాల్గవ రీచ్‌లో భూములను తీసుకుని ఉద్యోగం, పరిహారం ఇవ్వాలని రాచకుంటపల్లె బాధిత రైతులు కోరారు. 8ఏళ్లుగా 300ఎకరాలు బీళ్లుగా మారాయని.. పంటలు సాగు చేయక తీవ్రంగా నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని తుమ్మలపల్లె గ్రామ సమీపంలో భారత యురేనియం సంస్థ(యూసీఐఎల్) సుమారు రూ.1109.27కోట్లతో యురేనియం మైనింగ్‌తోపాటు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.
ప్రాజెక్టుకు 2240ఎకరాలు భూమి అవసరమవు తుందని.. ఇందులో 1118 ఎకరాలు ప్రభుత్వ భూమి.. 1122 ఎకరాలు ప్రయివేట్ భూమి ఉంది. ఇందుకు 2005 నవంబరు 4న నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం మొదటి, రెండవ, మూడవ రీచ్‌లలో ప్రాజెక్టుకు సుమారు 800ఎకరాల భూమిని యూసీఐఎల్ తీసుకుని బాధిత రైతులకు పరిహారం, ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా నాల్గవ రీచ్‌లో కూడా రాచకుంటపల్లె గ్రామ పరిధిలో సుమారు 60మంది రైతులకు చెందిన 300ఎకరాల భూమిని యూసీఐఎల్ తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ భూమిని ప్రాజెక్టుకు తీసుకొనేందుకు యూసీఐఎల్ ముందుకు రావడంలేదు.
పరిహారం, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ :
నాల్గవ రీచ్‌లో భూములను తీసుకుని పరిహారం, ఉద్యోగాలు ఇవ్వాలని బాధిత రైతులు డిమాండు చేస్తున్నారు. నాల్గవ రీచ్ భూములను తీసుకుంటామని గత 8ఏళ్ల నుంచి యూసీఐఎల్ కాలయాపన చేస్తోందని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి భూములను సర్వే కూడా చేశారు. భూములు తీసుకుని న్యాయం చేయాలని యూసీఐఎల్ యజమాన్యానికి పలు సార్లు రైతులు వినతిపత్రాలు ఇచ్చారు.
8 ఏళ్ల నుంచి బీళ్లుగా పొలాలు :
నాల్గవ రీచ్‌లో ప్రాజెక్టుకు కోల్పోతున్న భూము లు 8 ఏళ్లుగా బీళ్లుగా ఉన్నాయి. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే నాల్గవ రీచ్‌లో సుమారు 300ఎకరాలు బీళ్లుగా ఉండటంతో కంపచెట్లు, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. ఈ భూములకు మధ్యలో కొంత భూమిని మూడవ రీచ్‌లో యూసీఐఎల్ తీసుకుంది. దీంతో బాధిత రైతు లు పంటలు సా గు చేయలేకపోతున్నారు. భూములలో పంటలు సాగు చేస్తే వాటికి రక్షణ లేకుండా పోతోంది. అక్కడక్కడ పంటలు సాగు చేస్తే.. మధ్యలో యూ సీఐఎల్ తీసుకున్న పొలాలు బీళ్లుగా ఉండటంతో పంట దిగుబడులు రైతులకు దక్కడంలేదు.