మచిలీపట్నం : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులు శిక్షణ పొందేందుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి ఎం.చినబాబు గురువారం తెలిపారు. నవంబరు 5వ తేదీలోగా ఈ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాలని చెప్పారు. దరఖాస్తుదారుల కుటుంబ ఆదాయం ఏడాదికి లక్ష రూపాయలు మించకుండా ఉండాలని, డిగ్రీ విద్యార్హతతో పాటు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యేందుకు అన్ని అర్హతలు కలిగి ఉండాలన్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా కోర్సు చదువుతున్నా, ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నా ఉచిత శిక్షణకు అనర్హులని పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం నవంబరు 16న కామన్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని, ఇక్కడ అర్హత పొందిన అభ్యర్థులకు విజయవాడలోని బీసీ స్టడీ సర్కిల్‌లో డిసెంబరు ఒకటో తేదీ నుంచి శిక్షణ ఇస్తామని తెలిపారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని అభ్యర్థులకు విజయవాడలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను http://apbcwelfare.cgg.gov.in లోనమోదు చేసుకోవాలన్నారు. వివరాల కోసం ఫోన్ నం: 0866-433008లో సంప్రదించాలన్నారు.
సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
Published Fri, Oct 17 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM
Advertisement