ఎన్నికల నోటిఫికేషన్ గడువు.. జిల్లాలో అభివృద్ధి పనులు.. ఒకదానికొకటి పోటీపడి పరుగులు పెడుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల నోటిఫికేషన్ గడువు.. జిల్లాలో అభివృద్ధి పనులు.. ఒకదానికొకటి పోటీపడి పరుగులు పెడుతున్నాయి. ‘కోడ్’ కూయక ముందే ‘పనులు’ చక్కబెట్టుకునేందుకు ప్రజా ప్రతినిధులు చెమటోడుస్తున్నారు. ఐదేళ్లలో లేని అభివృద్ధిని రాత్రికి రాత్రే చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి గారడీ చేసి ఓట్లు గుంజే ఎత్తులు వేస్తున్నారు. అర్ధరాత్రి వరకూ శంకుస్థాపన పనుల్లో మునిగిపోతున్నారు.
గడిచిన నెల రోజుల్లో నేతలు జిల్లాకు రూ. 300 కోట్లకు పైగా అభివృద్ధి పనులు పట్టుకొచ్చారు. మరో రూ. 600 కోట్ల పనులకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్టు పనులతో ప్రజలకు గాలం వేసి కమీషన్లు రాబట్టే ద్విముఖ వ్యూహంలో నేతలు కదులుతున్నారు. తెలంగాణ విభజన నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఉపముఖ్యమంత్రి మినహా అన్ని నియోజకవర్గాల్లో నిధుల వరద పారుతోంది. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు చేసిన వివిధ అభివృద్ధి పనులకు చేసిన శంకుస్థాపనలు మచ్చుకు కొన్ని..
పటాన్‌చెరు: నందీశ్వర్‌గౌడ్
గడిచిన 20 రోజుల్లో రూ.20 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. జిన్నారం మండలంలో రూ.3.50 కోట్లతో రోడ్లు, అంగన్‌వాడీ తరగతి గదులు నిర్మాణం, పటాన్‌చెరు పట్టణంలో రూ.1.70 కోట్లతో జీహెచ్‌ఎంసీ రోడ్డు, రూ.1.90 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు, మరో రూ.5 కోట్లతో ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రామచంద్రాపురంలో మొత్తం రూ.3.90 కోట్లతో అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, రూ.2.50 కోట్లతో సీసీ రోడ్లు కోసం శిలాఫలకాలు వేశారు. రూ. 30 కోట్లతో గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులకు రేడోరేపో పునాది తీయనున్నారు. మరో రూ 70 కోట్ల పనులకు ఆయన ప్రతిపాదనులు పట్టుకుని తిరుగుతున్నారు.
గజ్వేల్ నియోజకవర్గం: నర్సారెడ్డి
గజ్వేల్ మండలం బయ్యారం, బెజుగామ గ్రామాల్లో రూ.11 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జగదేవ్‌పూర్ మండలంలోని ఎల్లాయగూడ, ధర్మారం, అలిరాజపేట గ్రామాల్లో రూ.18 లక్షలతో అంగన్‌వాడీ భవనాలకు శంకుస్థాపన. అలాగే నిర్మల్‌నగర్‌లో రూ.37 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం. కొండపోచమ్మ ఆలయంవద్ద రూ. 6.5 లక్షలతో సంప్‌హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
జహీరాబాద్: మంత్రి గీతారెడ్డి
రూ. 13.43 కోట్ల అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. జహీరాబాద్ మండలంలోని అల్లీపూర్ పారిశ్రామికవాడలో రూ.25 లక్షలతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన. అలాగే రూ.3.51 కోట్ల వ్యయంతో 54 అంగన్‌వాడీ భవనాల నిర్మాణం. రూ.34 లక్షలతో జహీరాబాద్‌లో నిర్మించిన శ్రీశక్తి భవనానికి ప్రారంభోత్సవం.
దుబ్బాక: ముత్యంరెడ్డి
దుబ్బాక నియోజకవర్గంలో పది రోజులలో రూ.8.90 కోట్లు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. దుబ్బాకలో బైపాస్ రోడ్డులో రూ. 80 లక్షలతో సీసీ, మురికి కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.30 ల క్షలతో నగరపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దుబ్బాకలో ఇందిర జలప్రభ పథకం కింద రూ.14 కోట్లతో పనులను ప్రారంభించారు.
సిద్దిసేట: హరీష్‌రావు
సుమారు రూ.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు చేశారు. గత నెల కలుపుకుంటే రూ.120 కోట్లకు పైమాటే. సిద్దిపేట పట్టణంలోని గత నెలలో రూ.2.5 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు జరిగాయి. చిన్నకోడూరు నుంచి రామంచ వరకు రూ. కోటితో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన. సిద్దిపేట మండలం మిట్టపల్లిలో రూ.42 లక్షలతో నిర్మించనున్న మోడల్ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బుధవారం ఒక్క రోజే ఎమ్మెల్యే చిన్నకోడూరు మండల పరిధిలోని 11 గ్రామాల్లో 30 శిలాఫలకాలు వేయడం గమనార్హం. నియోజకవర్గ అభివృద్ధికి వివిధ పథకాల కింద సుమారు రూ. 160 కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు అందజేశారు.
నర్సాపూర్: మంత్రి సునీతారెడ్డి
నియోజకవర్గంలో నిధుల వరదే పారుతోంది. గడిచిన 15 రోజుల్లో దాదాపు రూ. 50 కోట్ల పనులకు శంకుస్థాపన జరిగింది. జనవరి నెలలో జరిగిన పనుల వ్యయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే సుమారు రూ.140 కోట్ల 13 లక్షల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ 1.55 కోట్లతో నర్సాపూర్, కొల్చారంలో రెవెన్యూ కార్యాలయ భవనాలు. రూ 2.90 కోట్లతో నర్సాపూర్‌లో మార్కెట్ యార్డు, రూ. 40 లక్షలతో బస్టాండ్‌లో విస్తరణ పనులు, రూ. 95 లక్షలతో మోడల్ కాలనీలో వసతులు, రూ.13 కోట్లతో ఎస్సీ బాలికల వసతి గృహం, రూ. 6 కోట్లతో వెల్దుర్తిలో బీసీ రోడ్లు, ఇతర పనులు, రూ.30 కోట్లతో కొల్చారం మండలంలో బీటీ, ఇతర పనులు.. రూ. 5.50 కోట్లతో కౌడిపల్లి మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
సంగారెడ్డి : జగ్గారెడ్డి
గడిచిన 15 రోజుల్లో దాదాపు రూ. 62 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సదాశివపేటలో రూ.12 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం. రూ. 3.15 లక్షలతో కొండాపూర్ మండలంలో మినీ వాటర్ ట్యాంకుల నిర్మాణం, రూ. 1.85 కోట్లతో సంగారెడ్డి చౌరస్తా నుంచి ఇస్మాయిల్‌ఖాన్‌పేట వరకు బీటీ రోడ్డు, రూ.16 కోట్లతో సంగారెడ్డిలో సీసీ రోడ్ల నిర్మాణం, రూ. 6 కోట్లతో హిందూ శ్మశానవాటిక అభివృద్ధి పనులు, రూ. 80 లక్షలతో సీసీ పనులు, రూ.10 కోట్ల ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరో రూ. 100 కోట్లకు ప్రతిపాదనలు పట్టుకొని తిరుగుతున్నారు.
నారాయణఖేడ్: కిష్టారెడ్డి
రూ .7.50 కోట్లతో సీసీ రోడ్డు, రూ 60 లక్షలతో ఎమ్మార్వో భవనం, రూ. 4.20 కోట్లతో 70 అంగన్‌వడీ భవనాలు, రూ.3.75 కోట్లతో 30 గ్రామపంచాయతీ భవనాలు, రూ 2 కోట్లతో మోడల్ కాలనీ ఏర్పాటు, రూ 50 లక్షలతో బాలసదన్ హాస్టల్ భవనం నిర్మాణం పనులకు కిస్టారెడ్డి శంకుస్థాపన చేశారు.