అసలు పోరు షురూ! | How the Fighting! | Sakshi
Sakshi News home page

అసలు పోరు షురూ!

Published Thu, Jun 26 2014 11:56 PM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

అసలు పోరు షురూ! - Sakshi

అసలు పోరు షురూ!

 సంగారెడ్డి డివిజన్: ఎట్టకేలకు స్థానిక సంస్థల పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. జెడ్పీ, మున్సిపల్ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికకు గురువారం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు నెల రోజులకుగాపై పరోక్ష ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురుచూశారు. వచ్చే నెల 3వ తేదీన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, 4న మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది.
 
 5న జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. జిల్లాలో జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవితోపాటు 46 మండలాల్లో అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలు జరగనున్నాయి. అలాగే నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించనున్నారు.
 
 ఎన్నికల కమిషన్ ప్రకటించిన తేదీల్లోనే జెడ్పీ, మండల పరిషత్, మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవటం జరగనుంది. ఇదిలా ఉండగా జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ చైర్మన్‌ల ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావటంతో స్థానిక రాజకీయం మరింత వేడెక్కింది.
 
 జెడ్పీ పీఠంపై టీఆర్‌ఎస్ గురి
 జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. వచ్చే నెల 5న జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. జిల్లాలో 46 జెడ్పీటీసీ స్థానాలకుగాను టీఆర్‌ఎస్‌కు 21, కాంగ్రెస్‌కు 21 జెడ్పీటీసీ స్థానాలు దక్కాయి. టీడీపీ నాలుగు జడ్పీటీసీలను గెలుచుకుంది. అయితే ఇటీవలే గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముగ్గురు కాంగ్రెస్ జెడ్పీటీసీలతోపాటు గజ్వేల్, జగదేవ్‌పూర్ జెడ్పీటీసీలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరి చేరికతో టీఆర్‌ఎస్ బలం 26కు చేరుకుంది. దీంతో జెడ్పీ చైర్మన్ పదవి దాదాపుగా టీఆర్‌ఎస్ దక్కించుకోవటం ఖాయమైంది.
 
 అయితే కాంగ్రెస్ పార్టీ విప్ అస్త్రం ప్రయోగించి టీఆర్‌ఎస్‌ను అడ్డుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ జెడ్పీటీసీలకు విప్ జారీ చేసిన పక్షంలో వారు వెనక్కి తగ్గుతారని ఆ పార్టీ యోచిస్తోంది. అయితే టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ జెడ్పీటీసీలు విప్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా జెడ్పీ పీఠం టీఆర్‌ఎస్‌కే దక్కే అవకాశాలున్నాయి. దీంతో టీఆర్‌ఎస్ పార్టీలో జెడ్పీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. పలువురు ఆశావహులు ఇదివరకే కేసీఆర్‌ను కలిసి తమకు చైర్మన్ పదవి ఇవ్వాలని కోరినట్టు సమాచారం.
 
 మెజార్టీ మున్సిపాలిటీలు...
 జిల్లాలోని మెజార్టీ మున్సిపాలిటీ చైర్మన్ పదవులను కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల చైర్మన్ల ఎన్నికలు వచ్చే నెల 3న జరగనున్నాయి. సదాడశివపేట మున్సిపాలిటీ, జోగిపేట నగర పంచాయతీలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉంది. దీంతో రెండుచోట్లా కాంగ్రెస్ చైర్మన్‌లు కొలువుదీరే అవకాశాలు ఉన్నాయి. సంగారెడ్డి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు అత్యధికంగా 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు.
 
 బీజేపీ కౌన్సిలర్ల మద్దతుతో ఇక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. జహీరాబాద్ మున్సిపాలిటీలో సైతం కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఇక్కడ కూడా చైర్మన్ పదవిని కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలున్నాయి. కాగా మెదక్ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉండటంతో చైర్మన్ పదవి ఆ పార్టీకి దక్కనుంది. గజ్వేల్ నగర పంచాయతీలో టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు తొమ్మిది మంది ఎన్నికయ్యారు. కాంగ్రెస్ కౌన్సిలర్ ఒకరు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉన్నారు. దీంతో గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ పీఠాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకోనుంది.   
 
 మండల పరిషత్‌లలో
 టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ
 జిల్లాలో 46 మండల పరిషత్‌లున్నాయి. ఆయా మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలు 4వ తేదీన జరగనున్నాయి. మండల పరిషత్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ మెజార్టీ అధ్యక్ష స్థానాలు దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. 23 మండలాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్ష పదవులు కైవసం చేసుకోనుంది.
 
 కాంగ్రెస్ పార్టీ.. ఎంపీటీసీల బలం అధికంగా ఉన్న 16 చోట్ల మండల పరిషత్ అధ్యక్ష పదవులు కైవసం చేసుకునే అవకాశం ఉంది. తూప్రాన్ మండలంలో మండల అధ్యక్ష పదవిని టీడీపీ కైవసం చేసుకోనుంది. మిగతా ఆరు మండలాల్లో హంగ్ ఉన్నందున అక్కడ ఏ పార్టీకి మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు దక్కుతాయో తేలాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement