ఈసారీ నేలరాతలేనా? | furniture Shortages in Inter Exams in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఈసారీ నేలరాతలేనా?

Published Mon, Feb 25 2019 11:27 AM | Last Updated on Mon, Feb 25 2019 11:27 AM

furniture Shortages in Inter Exams in Andhra Pradesh - Sakshi

పీసీఆర్‌ పాఠశాల వద్ద సమయం మించి పరీక్ష కేంద్రానికి చేరుకోవడంతో విద్యార్థులను లోనికి అనుమతించని పోలీసులు (ఫైల్‌)

‘‘జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సర్వం సిద్ధం చేశాం. పరీక్షలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు, కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాం. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా చర్యలు చేపట్టాం’’ ఇదీ ఈనెల 21న కలెక్టరేట్‌లో జేసీ–2 కమలకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో సంభాషణ. ఇంటర్మీడియట్‌ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంటర్మీడియట్‌ ఆర్‌ఐవో కృష్ణయ్య  వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే పరిస్థితి పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. ఇంటర్మీ డియట్‌ పరీక్షల ప్రారంభానికి ఇక రెండు రోజులే గడువుంది. అయితే జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో వసతులు ఏమాత్రమూ కల్పించని దుస్థితి. దీంతో ఈసారి కూడా ఇంటర్మీడియట్‌ విద్యార్థులు అసౌకర్యాల నడుమే పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది. పరీక్షల ఏర్పాట్లపై ‘సాక్షి’ ఇస్తున్న కథనం..

చిత్తూరు కలెక్టరేట్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాల్లో వసతులపై అధికారుల మాటలు, ఏర్పాట్లు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. తాగునీరు, మరుగుదొడ్ల కొరత నెలకొంది. చీకటి గదులు అసౌకర్యంగా మారనున్నాయి. విద్యార్థులు పరీక్ష రాసే డ్యూయల్‌ డెస్కు లు కరువయ్యాయి. బెంచీలు కూడా అరకొరగా ఉన్నాయి. గదుల్లో ఫ్యాన్లు లేక ఉక్కపోతతో పరీక్షలు రాసే పరిస్థితి దాపురించబోతోంది. ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఈ నెల 27 వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. విద్యార్థుల ఉత్తమ ఫలి తాలను సాధించేందుకు కొన్ని నెలలుగా అహర్నిశలు కృషి చేస్తున్నారు. పరీక్షలు ప్రశాంతంగా రాయాలంటే కేంద్రాల్లో తగిన వసతులు, వాతావరణం ఉంటేనే లక్ష్యాలు నెరవేరుతాయి. జిల్లాలో ఇంటర్మీడియట్‌ అధికారులు ఎంపిక చేసిన కేంద్రాల్లో చాలావరకు అసౌకర్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేయకపోతుండడంతో సమస్యలు అధికమవుతున్నాయి. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యం అంతంత మాత్రంగానే ఉంది. మండలాల్లో ఉన్న కళాశాలలకు కొళాయిల ద్వారా తాగునీరు అందడం లేదు. ట్యాంకర్ల గురించి పట్టించుకోవడం లేదు.

అరకొర ఫర్నీచర్‌
జిల్లాలో 290 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. అందులో 133 పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటుచేశారు. ఈ పరీక్షలకు మొదటి సంవత్సరం నుంచి 52,975 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 54,742 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆ కేంద్రాల్లో ఫర్నీచర్, ఫ్యాన్లు అరకొరగా ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో అయిదారు గదుల్లో పరీక్షలు నిర్వహించబోతున్నారు. అక్కడ విద్యార్థుల సంఖ్యకు సరిపడ బెంచీలు, ఫ్యాన్లు లేవు. డ్యూయల్‌ డెస్కులు లేక బెంచీలపై పరీక్షలు రాయించడం ప్రతి ఏటా పరిపాటిగా మారిపోయింది. ఇంటర్మీడియట్‌ అధికారులు ఎంపిక చేసిన కేంద్రాల్లో చాలా వరకు గాలి వచ్చేలా గదులు లేవు. మరికొన్నింట్లో గదులు శిథిలావస్థలోకి మారాయి. కొన్ని కేంద్రాలు ప్రహరీ గోడలు లేని కారణంగా మాస్‌ కాపీయింగ్‌ జరిగే అవకాశాలున్నాయి.

మారుమూల విద్యార్థులకు కష్టాలే
ఇంటర్మీడియట్‌ పరీక్షలకు ప్రతి ఏటా ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించేది లేదు అనే నిబంధన పెడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో గత ఏడాది జరిగిన పబ్లిక్‌ పరీక్షల్లో ప్రిన్సిపాళ్లు అత్యుత్సాహం చూపడంతో దూరప్రాంతాల నుంచి 5నిమిషాలు ఆలస్యంగా వచ్చిన పలువురు విద్యార్థులు నష్టపోయారు. జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు మారుమూల ప్రాంతాల విద్యార్థులకు ప్రయాణం నరకంగా మారే అవకాశం ఉంది. ఉదయం 9గంటలకు పరీక్ష ప్రారంభమవుతుండగా గంటముందు కేంద్రాలకు చేరాల్సి ఉంది. సాధారణ రోజుల్లోనే అష్టకష్టాలు పడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు కళాశాలలకు వెళ్తుంటారు. పరీక్షల వేళ సమయానికి కేంద్రాలకు వెళ్లడం వారికి పరీక్షగానే నిలువనుంది. జిల్లాలోని బి.కొత్తకోట, తంబళ్లపల్లి, సత్యవేడు, నిండ్ర, పాలసముద్రం, ఎస్‌.ఆర్‌ పురం, విజయపురం, వాల్మీకిపురం, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో 10 నుంచి 20 కి.మీల దూరం విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ప్రయాణించాల్సిన పరిస్థితులున్నాయి. బస్సుల్లో కిక్కిరిసిన జనం మధ్య ప్రయాణం వారిలో సహనాన్ని పరీక్షించనుంది. అధికారులు ఇలాంటి కేంద్రాలను గుర్తించి సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడిపిస్తే మారుమూల ప్రాంతాల విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement