వేముల, న్యూస్‌లైన్ : భవిష్యత్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా యూత్ అధ్యక్షులు వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మండలంలోని భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లె, మీదిపెం ట్ల కోట గ్రామాల్లో మంగళవారం మండల నా యకులు నాగేళ్ల సాంబశివారెడ్డితో కలిసి వైఎస్ అవినాష్‌రెడ్డి గడప.. గడప కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో గడప.. గడప తొక్కుతూ వైఎస్‌ఆర్ సీపికి అండగా నిలవాలని మహిళలను, వృద్ధులను, యువకులను అభ్యర్థించారు. వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి రాగానే ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలు అందిస్తామని హామీనిచ్చారు. ఇప్పటికి గ్రామాల్లో సంక్షేమ పథకాలు అందని నిరుపేదలు చాలామంది ఉన్నారని తెలిపారు.
సమస్యలకు పరిష్కారం చూపుతాం.. :
ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై స్పందించిన వైఎస్ అవినాష్‌రెడ్డి సమస్యలకు పరిష్కారం చూపుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రతిచోట పింఛన్ రాలేదని.. పక్కాగృహం మంజూరు కాలేదని.. ఉపాధి అవకాశాలు కుల్పించాలనే సమస్యలే ఎక్కువగా ఆయన దృష్టికి వచ్చాయి. వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి రాగానే.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
నాలుగో రీచ్‌లో భూములను తీసుకొనేలా చూడండి :
తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టుకు నాల్గవ రీచ్‌లో భూములు తీసుకునేలా చూడాలని బాధిత రైతులు వైఎస్ అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ప్రాజెక్టుకు నాల్గవ రీచ్ కింద భూములను తీసుకుంటామని చెప్పిన యూసీఐఎల్ ఆ తర్వాత పట్టించుకోలేదని వివరించారు. ప్రాజెక్టు భూములు తీసుకోక.. పంటలు సాగు చేయక పొలాలన్నీ బీళ్లుగా మారాయని.. ఆ భూములను యూసీఐఎల్ తీసుకొనేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రాజెక్టు ఇడీ బెహల్‌తో చర్చిస్తానని.. బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీనిచ్చారు.
ఆయా గ్రామాల్లో అపూర్వ స్వాగతం :
గడప.. గడపకు విచ్చేసిన వైఎస్‌ఆర్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆ పార్టీ మండల నాయకులు నాగేళ్ల సాంబశివారెడ్డిలకు ఆయా గ్రామాల్లో అపూర్వ స్వాగతం లభించింది. గ్రామ సరిహద్దులకు చేరిన వెంటనే డప్పు వాయిద్యాల మధ్య టపాసులు పేల్చుతూ తమ అభిమాన నేతను సాదరంగా గ్రామాల్లోకి ఆహ్వానించారు. గ్రామానికి చేరిన వెంటనే ఆయనతో నాయకులు, కార్యకర్తలు, యువకులు కరచాలనం కోసం పోటీపడ్డారు. కార్యక్రమంలో వేల్పుల సొసైటీ అధ్యక్షులు శివశంకర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాజారెడ్డి, బయపురెడ్డి, మరకా శివకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ వైఎస్‌ఆర్‌సీపీదే
Published Wed, Jan 1 2014 4:35 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM
Advertisement