సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ అసెంబ్లీ చేసిన నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రశ్నించజాలరని, అసెంబ్లీ అధికారంలో జోక్యం చేసుకోజాలరని బుధవారం లోక్‌సభలో ప్యానెల్ స్పీకర్ ఎ.రాజా స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ పాలన వికేంద్రీకరణపై ఏపీ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై సభాపతి స్థానంలో ఉన్న ప్యానెల్ స్పీకర్ రాజా పలుమార్లు జోక్యం చేసుకుని వారించారు. అయినా వినిపించుకోకుండా గల్లా పదేపదే అదే అంశాన్ని ప్రస్తావించడంతో వైఎస్సార్‌సీపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజా స్పందిస్తూ.. ‘అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను ఇక్కడ(పార్లమెంటులో) ప్రశ్నించలేరు.. ప్రస్తావించనూ లేరు. అది అసెంబ్లీ అధికారం. దానిలో జోక్యం చేసుకోజాలం’ అని విస్పష్టంగా పేర్కొన్నారు.
రాష్ట్ర సర్కారుపై విమర్శలు
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన గల్లా జయదేవ్ తన ప్రసంగమంతా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలతోనే సరిపుచ్చారు. ఏపీలోని కొత్త ప్రభుత్వం హేతుబద్ధం కాని నిర్ణయాలు తీసుకుంటోందని, రెండంకెల వృద్ధి సాధించిన తమ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక పతనాన్ని ఎదుర్కొంటోందని విమర్శించారు. రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులను పరిశ్రమలు ఉపసంహరించుకున్నాయని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలుగా చేసిందని వ్యాఖ్యానించారు. దీంతో వైఎస్సార్‌సీపీ ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని అభ్యంతరం వ్యక్తంచేశారు. జయదేవ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాజధాని వికేంద్రీకరణను రాష్ట్ర కేబినెట్, అసెంబ్లీ ఆమోదించిందని, అయితే శాసన మండలిలో చైర్మన్ ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తే ప్రభుత్వం కౌన్సిల్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని తప్పుపట్టారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి తన సమాధానంలో రాజధాని నిర్ణయం రాష్ట్రాలదేనని చెప్పారని, కానీ రాజధానులని ప్రస్తావించలేదని పేర్కొన్నారు. అమరావతిని నోటిఫై చేస్తూ అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవోను కేంద్రం గుర్తించిందన్నారు. ఈ సమయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మళ్లీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ప్రసంగంపైనే దృష్టి పెట్టండి..
ఈ నేపథ్యంలో ప్యానెల్ స్పీకర్ జోక్యం చేసుకుని ‘మీరు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చిస్తున్నారు. దానికే పరిమితం కావాలి..’ అంటూ గల్లా జయదేవ్‌కు సూచించారు. అయితే గల్లా వినిపించుకోలేదు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తామని ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ చెప్పిందని, ఇప్పుడు మూడు రాజధానులు తెచ్చిందని వ్యాఖ్యలు చేశారు. దీంతో విషయంలోకి రావాలంటూ ప్యానెల్ స్పీకర్ ఆయనకు సూచించారు. ‘‘మీ ప్రకటన వివాదానికి దారితీస్తోంది. అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రశ్నించజాలరు.. దానిని గుర్తుంచుకోవాలి..’’ అని ఒకింత ఘాటుగా చెప్పారు. దీంతో తాను ప్రశ్నించట్లేదని, కేవలం నేపథ్యమే చెబుతున్నానంటూ గల్లా తిరిగి అవే విషయాలు మాట్లాడారు.
ప్యానెల్ స్పీకర్ మరోసారి జోక్యం చేసుకుంటూ.. ‘‘మీ సమయాన్ని వృథా చేసుకోరాదు. రాష్ట్రపతి ప్రసంగంపైనే దృష్టిపెట్టండి..’’ అని హితవు పలికారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనే గల్లా తిరిగి మాట్లాడుతూ నిపుణుల కమిటీకి చట్టబద్ధత లేదని, ముఖ్యమంత్రి వాటిని ప్రభావితం చేశారని ఆరోపించారు. మూడు రాజధానుల వల్ల ఆర్థిక భారం మూడు రెట్లు పడుతుందన్నారు. తిరిగి ప్యానెల్ స్పీకర్ జోక్యం చేసుకుని.. అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను ఇక్కడ ప్రశ్నించలేరు.. కనీసం ప్రస్తావించనూ లేరని, అసెంబ్లీ అధికారంలో మనం జోక్యం చేసుకోజాలమని అంటూ మీరు వినకపోతే నేను ఇంకో సభ్యుడిని పిలుస్తానని హెచ్చరించారు. అయినా వినిపించుకోకుండా జయదేవ్ ముఖ్యమంత్రిపై విమర్శలు కొనసాగించారు. దీంతో ‘ఆ వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లవు’ అని ప్యానెల్ స్పీకర్ స్పష్టంచేశారు. కానీ జయదేవ్ అమరావతిపైనే మాట్లాడుతుండడంతో వేరొక సభ్యుడి పేరును రాజా పిలిచారు. దీనిపై జయదేవ్ అభ్యర్థించడంతో నిమిషం సమయమిస్తూ ప్రసంగాన్ని ముగించాలని కోరారు. కానీ గల్లా మళ్లీ పాత విషయాలే ప్రస్తావించడంతో ప్యానెల్ స్పీకర్ మాట్లాడాలంటూ మరొక సభ్యుడి పేరును పిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment