బాబుతో గంటా, ఏరాసు భేటీ! | Ganta Srinivasa Rao, Erasu Prathap reddy meey Chandra Babu | Sakshi
Sakshi News home page

బాబుతో గంటా, ఏరాసు భేటీ!

Published Tue, Feb 25 2014 1:54 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

బాబుతో గంటా, ఏరాసు భేటీ! - Sakshi

బాబుతో గంటా, ఏరాసు భేటీ!

అరగంట పాటు మంతనాలు

 టీడీపీలో చేరికకు గ్రీన్‌సిగ్నల్

 షరతులపై సీఎం రమేశ్‌తో చర్చలు

 సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ ప్రభుత్వంలోని మం త్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి సోమవారం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. ఉదయం 10 గంటల సమయంలో చంద్రబాబు నివాసానికి చేరుకున్న ఇద్దరు మం త్రులు దాదాపు 30 నిమిషాల పాటు ఆయనతో మంతనాలు జరిపారు. తాము పార్టీలో చేరితే ఇచ్చే ప్రాధాన్యత, తమ వెంట వచ్చే వారికి కూడా సీట్ల కేటాయింపు వంటి అంశాలపై చర్చించారు. వారిద్దరితో పాటు వారి వెంట వచ్చే అనుచరులు తెలుగుదేశంలో చేరేం దుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్  ఇచ్చారు. అనంతరం గతంలోనే అంగీకరించిన షరతులపై టీడీపీ ఉపాధ్యక్షుడు, ఎంపీ సీఎం రమేష్‌తో మంత్రులు మరోమారు చర్చలు జరిపారు. గంటా నివాసంలో జరిగిన చర్చల్లో ఏరాసుతో పాటు టీజీ వెంకటేశ్, శిల్పా మోహన్‌రెడ్డిలు కూడా పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయ వర్గాలు మాత్రం మంత్రులు చంద్రబాబుతో భేటీ కాలేదంటూ మీడియాకు లీక్ ఇచ్చాయి. వారు ఈ నెల 27 లేదా ఆ తర్వాత భేటీ కానున్నట్టు తెలిపాయి.

 వారంతా వచ్చేలా చూడండి..

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అవకాశాలు లేని నేతలను గుర్తించి, వారిని తెలుగుదేశంలో చేర్పించాలన్న చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలోనే.. పారిశ్రామికవేత్తలైన టీడీపీ నేతలు కొందరు ఆ పనిలో నిమగ్నమైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవలి పరిణామాలతో రాష్ట్రంలో టీడీపీ బాగా బలహీనపడిన నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి నేతలను చేర్పించుకుంటే తెలుగుదేశం బలంగా ఉందని ప్రజలు భావించే అవకాశాలుంటాయని, అందువల్ల గతంలో వైఎస్సార్‌సీపీలో చేరడానికి ప్రయత్నించినా చోటు దొరకని నాయకుల జాబితాను తయారుచేసి వారిని ఎలాగైనాసరే టీడీపీలో చేర్పించాలని అధ్యక్షుడు ఆదేశించినట్టు ఆ వర్గాలు వివరించారుు.

 సుష్మా చర్యలతో మోడీ ఇమేజ్ తగ్గింది

 లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ చర్యలతో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఇమేజ్ తగ్గిందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు  అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం సీమాంధ్ర నేతల సమావేశంలో ప్రసంగించటంతో పాటు ఆ తరువాత జిల్లాల వారీగా ముఖాముఖి మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement