పేలిన గ్యాస్ సిలిండర్ ఇద్దరికి గాయాలు
Published Sun, Feb 2 2014 3:03 AM | Last Updated on Sat, Aug 25 2018 5:39 PM
బుడితి(సారవకోట రూరల్), న్యూస్‌లైన్: అనుమతి లేకుండా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండగా సిలిండర్ పేలడంతో ఇద్దరు గాయాలపాలవగా, సుమారు రూ.20 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లింది. ఈ సంఘటన శనివారం సారవకోట మండలం బుడితిలో జరిగింది. వివరాలు ఇవీ... బుడితికి చెందిన గెంబలి ప్రసాద్ ఇంట్లోనే ఓ దుకాణం నడుపుతున్నారు. అక్కడ పెద్ద గ్యాస్ సిలిండర్ల నుంచి చిన్ని సిలిండర్లకు(3 నుంచి 5 కేజీలు) గ్యాస్ ఎక్కిస్తుంటాడు. దీనికి ఎటువంటి అనుమతిలేదు. ఈ నేపథ్యంలో శనివారం జలుమూరు మండలం తిమడాంకి చెందిన లింగబైరి అప్పన్న(30) చిన్న సిలిండ ర్లో గ్యాస్ నింపించడానికి వచ్చాడు.
గ్యాస్ ఎక్కిస్తూ లోపలి నుంచి స్టౌకు సంబంధించిన పరికరం తీసుకురావడానికి ప్రసాద్ లోపలకి వెళ్లినప్పుడు సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటల నుంచి తప్పించుకోడానికి బయటకు రాలేకపోయిన అప్పన్న మేడమీదకు పరుగులు తీశారు. పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు కమ్మ పట్టుకుని కిందకు జారాడు. మంటలు వ్యాపిచడంతో ఆయన కాళ్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. కాగా ప్రసాద్ చేతి మీద తీవ్రంగా కాలిపోవడంతో 108 వాహనంలో నరసన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
సంఘటన జరిగినప్పుడు ఇంట్లో 14 చిన్న 3 పెద్ద సిలిండర్లు ఉన్నాయి. దీంతో ప్రజలు దగ్గరకు వెళ్లడానికి సాహసించలేదు. ఇంతలో కోటబొమ్మాళి నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అనంతరం నరసన్నపేట అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటనా స్ధలానికి చేరుకుని భవనానికి పలు చోట్ల రంధ్రాలు పెట్టి పూర్తిస్థాయిలో మంటలను అదుపు చేశారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, నగదు, బంగారం, వెండి వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. సంతబొమ్మాళి మండలం గృహ నిర్మాణ శాఖ ఏఈ గుడ్ల నరసింహమూర్తి నివశిస్తున్న రెండో అంతస్తుకు మంటలు వ్యాపించడంతో అక్కడా ఆస్తినష్టం సంభవించింది. పేలువు వల్ల రెండంతస్తుల మేడ పూర్తిగా దెబ్బతింది. సమీపంలో ప్రాథమిక పాఠశాల ఉండడంతో విద్యార్థులను తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లిపోయారు.
ఇదిలా ఉండగా సిలిండర్లు పేలినప్పటికీ ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రసాద్ చిన్న కుమారుడి బారసాల రెండురోజుల్లో ఉండడంతో కుటుంబ సభ్యులంతా రాజాంలో ఉన్నారు. గృహ నిర్మాణ శాఖ ఏఈ నరసింహమూర్తి భార్య లక్ష్మి దేవాలయానికి వె ళ్లగా ఆయన దుకాణం దగ్గర కూర్చీలో కూర్చుని ఉండటంతో మంటల్ని చూసి దూరంగా వెళ్లిపోయారు. మంటల్ని అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటలు శ్రమించారు. పాతపట్నం సీఐ, ఎస్‌ఐ శ్రీనివాసరావు, సురేష్‌బాబు, స్ధానిక పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. తహశీల్దార్ రామారావు, ఆర్‌ఐ అనురాధ నష్టాన్ని అంచనా వేశారు. వీఆర్వో గజపతినారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ శ్రీనివాసరావు తెలిపారు.
Advertisement
Advertisement