
మోత్కుపల్లీ.. నోరు జాగ్రత్త
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విభజన వాదా? లేక సమైక్యవాదా? అనే విషయాన్ని ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు చెప్పగలరా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. నోరుంది కదా అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరించారు. గట్టు శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ, మోత్కుపల్లి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
సమాజంలో దేనికీ పనికిరాని చంద్రబాబు గురించి మోత్కుపల్లి గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు అవినీతిపరుడు కావటంవల్లే ప్రతి ఎన్నికల్లోనూ ఆయనను ప్రజలు ఓడిస్తున్నారని చెప్పారు. జగన్‌ను ప్రజలు విశ్వసిస్తున్నందునే 5.45 లక్షల మెజారిటీతో లోక్‌సభకు గెలిపించారని చెప్పారు. చంద్రబాబుకు దమ్ముంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధపడాలని సవాల్ చేశారు. తప్పుడు కూతలు కూయడంలో తర్ఫీదు పొందిన మోత్కుపల్లి గతంలో చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సందర్భంలో ఏమన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు.