సెప్టెంబర్ 2న సార్వత్రిక సమ్మె
* రైతుల గోడును ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
* కార్మిక, ఉద్యోగ సంఘాల సమరభేరిలో నేతలు
సాక్షి, విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న కార్మిక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా సెప్టెంబర్ 2న సార్వత్రిక సమ్మె చేయాలని జాతీయ, రాష్ట్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్మిక, ఉద్యోగ సంఘాల సమరభేరిలో ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ మాట్లాడారు.
కేంద్రం ప్రతిపాదిస్తున్న కార్మిక నిబంధనావళి బిల్లు-2015 కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేదిగానూ, కార్మిక వ్యతిరేకంగానూ ఉందని దుయ్యబట్టారు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు బాసుదేవ ఆచార్య మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం రైతుల గోడును పట్టించుకోకుండా వేలాది ఎకరాల జరీబు భూముల్ని రాజధాని నిర్మాణానికి తీసుకుందని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతన చట్టాలు అమలు చేయడానికి ప్రభుత్వాల వద్ద నిధులు ఉండవని, కార్పొరేట్ శక్తులకు రూ.కోట్లలో రాయితీలిచ్చేందుకు మాత్రం డబ్బు ఉంటుందన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ కార్మికులకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏడాది గడిచినా ఒక్కటీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె జరగడానికి ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పి.ఎస్.చంద్రశేఖరరావు (ఏఐటీయూసీ), వెంకటసుబ్బయ్య (ఐఎన్‌టీయూసీ), శ్రీనివాసరావు (హెచ్‌ఎంఎస్), వి.ఉమామహేశ్వరరావు (సీఐటీయూ), కె.సుధీర్ (ఏఐటీయూసీ), ప్రసాద్, రామారావు (ఐఎఫ్‌టీయూ) పాల్గొన్నారు.