గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
Published Thu, Sep 1 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
హన్మకొండ అర్బన్ : కల్లు గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం(టీకేజీకేఎస్) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జనగాం శ్రీనివాస్ మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పరిహారం చెల్లించాలని, శాశ్వత వైకల్యం పొందిన కార్మికులకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిహారం కోసం జిల్లా వ్యాప్తంగా 200 మంది ఎదురు చూస్తున్నారని అన్నారు. బాధితులు వివరాలు ఇస్తే వెంటనే మంజూరు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోలేదని ఆరోపించారు. తమ సమస్యలు తక్షణమే పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు తాళ్లపెల్లి రామస్వామి, కుర్ర ఉప్పలయ్య, కోల జనార్దన్, బుర్ర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement