కర్నూలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ ప్రజలు రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. స్వార్థ రాజకీయాలకు తెలుగు ప్రజలను విడదీయడం అన్యాయమంటూ ఆదోనిలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం నుంచి భీమాస్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. డోన్‌లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను పట్టణ పురవీధుల్లో చీపుర్లతో కొడుతూ ఊరేగించారు. ఇదే మండలంలోని యు.కొత్తపల్లెలో జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు సోనియా జన్మ దినాన్ని బ్లాక్‌డేగా పాటించారు.
ఆమె దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. నందికొట్కూరులో కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. పత్తికొండలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సోనియా గోబ్యాక్ అంటూ నాలుగు స్తంభాల కూడలిలో నినదించారు. కోడుమూరులోని కోట్ల సర్కిల్‌లో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. సోనియా జన్మదినం తెలుగు జాతి కర్మదినం పేరిట సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కర్నూలులోని రాజ్‌విహార్ సెంటర్‌లో నల్ల జెండాలతో రాస్తారోకో చేపట్టారు. సమితి జిల్లా చైర్మన్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ కొడిదెల శివనాగిరెడ్డి, విద్యార్థి జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు భానుచరణ్ రెడ్డి, బుద్ధి రాజు గౌడ్‌ల ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. ఆటో కార్మికుల జేఏసీ పిలుపులో భాగంగా మధ్యాహ్నం వరకు ఆటోల బంద్ చేపట్టారు.
మిన్నంటిన నిరసన
Published Tue, Dec 10 2013 6:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement