పుష్కరాల్లో వివిధ శాఖలు నిర్వర్తించాల్సిన బాధ్యతలను నిర్దేశించడంతోపాటు భక్తులకు అసౌకర్యం కలగకుండా చేపట్టే చర్యలపై ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పలు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులు, క్షేత్ర స్థాయి అధికారులతో రాజమండ్రి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సమావేశం అయ్యారు. పట్టణ స్నానఘట్టాలపై భారం పడకుండా గ్రామాల్లోని స్నానఘట్టాలను కూడా సౌకర్యవంతంగా తీర్చిదిద్ది, రవాణా సదుపాయాలు కల్పించాలని ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ శాఖలను ఆదేశించారు. స్నానఘట్టాల వద్ద భక్తులకు ప్రమాదాలు జరగకుండా చర్యలతో పాటు గజ ఈతగాళ్లను నియమించాలని, రక్షణ సామగ్రిని ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు.
పారిశుద్ధ్య పనుల కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కాంట్రాక్టు పనివారిని నియమించుకోవాలని ఆదేశించారు. పిండప్రదాన కార్యక్రమాలు, పురోహితుల పారితోషికాలు, రవాణా ధరలు తదితరాలను ముందుగానే నిర్దేశించి ఆ ప్రకారమే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖను కోరారు. పుష్కరాల నిర్వహణకు దేవాదాయ శాఖను నోడల్ శాఖగా నియమిస్తున్నామన్నారు. స్నానఘట్టాల వారీగా కమిటీలను వేసి వాటి ఆధ్వర్యంలో పుష్కరాల ప్రాధాన్యం తెలుపుతూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను ముందు నుంచే నిర్వహించాలన్నారు.
ఏ శాఖకు ఎన్ని నిధులు..
పుష్కరాల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో అధికారులు రూ.624 కోట్ల మేర ప్రతిపాదనలు సమర్పించగా ప్రభుత్వం నుంచి రూ.384 కోట్లు విడుదలయ్యాయని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ సమావేశంలో తెలిపారు. మంజూరు లభించిన పనులను తక్షణం చేపడతామన్నారు. ఇంకా రూ.239 కోట్లు విడుదల కావాల్సి ఉందని సీఎస్‌కు నివేదిక సమర్పించారు. వాటి వివరాలివే...
నిధులు వచ్చిన శాఖలు
ఏ బాధ్యతలు ఏ శాఖకు..
ముఖ్య కార్యదర్శి సమీక్షలో ఏ శాఖ ఏయే బాధ్యతలు నిర్వర్తించాలనే అంశానికి తుదిరూపునిచ్చారు. స్నానఘట్టాల అభివృద్ధి, ఫ్లడ్‌బ్యాంకుల ఏర్పాటు, రెస్క్యూ ఆపరేషన్ల నిర్వహణ ఇరిగేషన్ శాఖ నిర్వహిస్తుంది. పారిశుధ్యం, టాయిలెట్ల నిర్వహణ పంచాయతీరాజ్, పురపాలక శాఖ, గ్రామీణ నీటిపారుదల శాఖలు సమన్వయంతో నిర్వహిస్తాయి. యాత్రికులకు తాత్కాలిక వసతి సదుపాయాలను పంచాయతీరాజ్, పురపాలక శాఖలు ఏర్పాటు చేస్తాయి. స్నాన ఘట్టాలవద్ద తాగునీరు, యాత్రికులు దుస్తులు మార్చుకునేందుకు సదుపాయాలను పంచాయతీరాజ్, పురపాలక శాఖలు కల్పిస్తాయి. పుష్కర ప్రాంతాల్లో అప్రోచ్‌రోడ్లు, బారికేడ్ల నిర్మాణ బాధ్యతలు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ నిర్వహిస్తాయి. వైద్య ఆరోగ్యశాఖ యాత్రికులకు ప్రాథమిక చికిత్స, ఇతర వైద్య సేవలను అందిస్తుంది. దేవాలయాల మరమ్మతులు, పురావస్తు కేంద్రాల సంస్కరణ బాధ్యతలు దేవాదాయ శాఖ, పురావస్తు శాఖ సంయుక్తంగా నిర్వహిస్తాయి. పోలీసు శాఖ భద్రతా చర్యలను, విద్యుత్తు శాఖ సంబంధిత బాధ్యతలను యథావిధిగా నిర్వహిస్తాయి. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు రవాణా సదుపాయాలను రైల్వే, ఆర్టీసీ అధికారులతోపాటు పర్యాటక శాఖ అధికారులు కూడా చూస్తారు. పుష్కరాల ప్రాధాన్యాన్ని ముందునుంచీ చాటిచెబుతూ, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలను నిర్వర్తించడం, పుష్కరాల్లో కూడా భక్తులకు సమాచారం అందించాల్సిన బాధ్యతలు సమాచార శాఖ నిర్వహిస్తుంది. సమావేశంలో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, దేవాదాయ, పురపాలక, వైద్య ఆరోగ్య, నీటిపారుదల శాఖ, హోంశాఖల ముఖ్య కార్యదర్శులు జేఎస్‌వీ ప్రసాద్, ఎ.గిరిధర్, లవ్ అగర్వాల్, శశిభూషణ్, ప్రసాదరావు, దేవాదాయ శాఖ కార్యదర్శి అనూరాధ, ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు హెచ్.అరుణ్ కుమార్, కె.భాస్కర్, ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ రేవు ముత్యాలరాజు, ఐజీ అతుల్ సింగ్, ఏలూరు రేంజ్ డీఐజీ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉభయగోదావరి జిల్లాల ఎస్పీలు ఎం.రవిప్రకాష్, రాఘవారెడ్డి, రాజమండ్రి అర్బన్ ఎస్పీ హరికృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, రాజమండ్రి సబ్‌కలెక్టర్ విజయరామరాజు, పుష్కరాల ప్రత్యేకాధికారి, రాజమండ్రి కమిషనర్ జె.మురళి, ఏజేసీ మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.