కుమార్తె వద్ద దీనంగా కూర్చున్న తండ్రి శేఖర
అంతుచిక్కని జబ్బు ఆమెను మంచానికి పరిమితం చేసింది. చూస్తుండగానేఅది ప్రాణాంతకంగా మారింది. ప్రాణాలు దక్కాలంటే శస్త్రచికిత్సలే మార్గమంటూవైద్య నిపుణులు తేల్చి చెప్పారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కుమార్తె ప్రాణాలు దక్కించుకునేందుకు నిరుపేద తండ్రి పడరాని పాట్లు పడుతున్నాడు.ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్సకు నోచుకోని అరుదైన జబ్బు బారి నుంచి
తన బిడ్డను కాపాడాలంటూ అర్థిస్తున్నాడు.
అనంతపురం : నల్లమాడ మండలంలోని పెమనకుంటపల్లికి చెందిన బైముతక లలితమ్మ, శేఖర్ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని శేఖర్ పోషించుకుంటున్నాడు. కరువు నేపథ్యంలో పనులు సక్రమంగా లేక సంపాదన అరకొరగానే ఉంటోంది. రోజంతా శ్రమించిన వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ భారంగా మారింది.
జబ్బు మీద జబ్బు..
శేఖర్ దంపతుల పెద్ద కుమార్తె స్నేహలత పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి కష్టాలను దగ్గర నుంచి చూసిన ఆమె ఎలాగైనా ఉన్నత చదువులు అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ద్వారా తండ్రికి చేదోడుగా నిలవాలని భావించింది. అయితే విధి వక్రీకరించింది. మూడు నెలల క్రితం అంతు చిక్కని జబ్బు బారిన పడ్డ ఆమె... ఒకదాని తర్వాత మరో జబ్బుతో పూర్తిగా మంచానపడింది.
ఏమి తిన్నా వాంతులే..
మూడు నెలల క్రితం స్నేహలత కుడిరొమ్ము పైభాగాన తొలుత చర్మం ఎర్రగా మారి, పుండులా మారింది. చీమూరక్తం బయటకు వస్తుండడంతో వైద్యులకు చూపించారు. చర్మసంబంధిత వ్యాధిగా నిర్ధారించి వైద్యులు చికిత్సలు చేస్తూ వచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స కోసం పుట్టపర్తి, కదిరి, బత్తలపల్లి, అనంతపురం తదితర ప్రాంతాల్లోని వైద్య శాలల చుట్టూ తిరిగాడు. తన సంపాదనలో కుమార్తెల చదువులు, పెళ్లిళ్లకంటూ పొదుపు చేస్తూ వచ్చిన సొమ్ము మొత్తం ఖర్చు పెట్టాడు. అయినా నయం కాలేదు. తెలిసిన వారి వద్ద నుంచి అప్పులు చేసి మరీ బిడ్డకు నయం చేయించేందుకు ప్రయత్నించాడు. జబ్బు నయం కాలేదు కదా.. ఎడమ డొక్కలో గడ్డలా మరో సమస్య ఉత్పన్నమైంది. అప్పటి నుంచి హేమలత ఏమి తిన్నా.. విపరీతమైన కడుపునొప్పితో విలవిల్లాడిపోతోంది. తాను తిన్న ఆహార పదార్థం పూర్తిగా వాంతి రూపంలో బయటకు వచ్చేస్తోంది.
నిద్రకు దూరమై...
పాఠశాలలో మెరుగైన విద్యార్థుల్లో ఒక్కరుగా రాణిస్తున్న హేమలత.. తన జబ్బు కారణంగా చదువులకు దూరమైంది. మూడు నెలలుగా ఆమె పాఠశాల మెట్టు ఎక్కలేదు. తిన్న ఆహారం కూడా వాంతుల రూపంలో బయటకు వచ్చేస్తుండడంతో పూర్తిగా నీరసించి పోయి, మంచానికే పరిమితమవుతూ వస్తోంది. ఛాతీ మీద, కడుపులోని పుండ్ల వల్ల భరించలేని నొప్పితో బాధపడుతోంది. చివరకు నొప్పి వల్ల ఆమె నిద్రకు సైతం దూరమైంది. తెల్లవార్లు బాధతో విలవిల్లాడుతున్న కుమార్తెను సముదాయించేందుకు తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు చెప్పనలవి కాదు.
శస్త్రచికిత్సకు రూ. 3 లక్షలు
కుమార్తెకు చికిత్స చేయించేందుకు జిల్లాలోని ప్రముఖ ఆస్పత్రుల చుట్టూ తిరిగి రూ. లక్షకు పైగా శేఖర్ ఖర్చు పెట్టాడు. అయినా ఆమె ఆరోగ్యం మెరుగు పడలేదు. ఇటీవల హేమలత వైద్య ఖర్చుల కోసం రూ.10 వేల ఆర్థిక సాయాన్ని వెంగళమ్మ చెరువు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అందించడంతో తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి కుమార్తె హేమలతను తీసుకెళ్లాడు. పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె రొమ్ము పైభాగాన ఉన్న గడ్డలను శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉందని తేల్చి చెప్పారు. ఇందుకు రూ. 2 లక్షలకు పైగా ఖర్చు వస్తుందన్నారు. కడుపులోని పుండ్లకు మరో శస్త్రచికిత్స చేయడం ద్వారా తొలగించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇందుకు మరో రూ. లక్ష వరకు ఖర్చు వస్తుందని అంచనా వేశారు.
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
భవన నిర్మాణ రంగంలో పనులు తగ్గాయి. రోజంతా శ్రమించినా వచ్చే అరకొర సంపాదనతో కుటుంబ పోషణే భారంగా మారింది. కూలీనాలి పనులు చేసుకుంటూ ఇప్పటికే కుమార్తె చికిత్స కోసం అప్పులు చేసి రూ. లక్షకు పైగా శేఖర్ ఖర్చు పెట్టుకున్నాడు. తిరుపతిలోని స్విమ్స్ వైద్యులు చెప్పిన మేరకు శస్త్ర చికిత్సలతో తన కుమార్తెకు మునపటి జీవితం దక్కుతుందని ఆశపడ్డాడు. అయితే శస్త్రచికిత్సలకు అవసరమైన రూ.3 లక్షలు ఎక్కడి నుంచి తేవాలో దిక్కుతోచని అసహాయ స్థితిలో శేఖర్ దంపతులు కొట్టుమిట్టాడుతున్నారు. దాతలెవరైనా ముందుకొచ్చి తమ కుమార్తె ఆపరేషన్‌కు ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్నారు.
ఆరోగ్యశ్రీ పరిధిలో లేదన్నారు
శస్త్రచికిత్సతోనే నా కుమార్తెకు సోకిన జబ్బుకు నయమవుతుందని తిరుపతిలోని స్విమ్స్ వైద్యులు అంటున్నారు. ఇందుకు సుమారు రూ. 2 లక్షలకు పైగా ఖర్చు అవుతుందన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదని అంటున్నారు. అంతకు ముందు బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఇక్కడ సాధ్యం కాదని వారు చెప్పారు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. – శేఖర్, విద్యార్థిని తండ్రి
స్పెషలిస్టు దగ్గరకు తీసుకెళ్లాలి
విద్యార్థిని స్నేహలతకు కుడి రొమ్ము పైభాగాన ఎర్రగా మారి తీవ్రమైన సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు పిత్తాశయానికి ఇన్‌ఫెక్షన్ సోకింది. దీని వల్ల ఆమె పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. స్పెషలిస్టుల వద్ద చూపించి, శస్త్రచికిత్స చేయిస్తే తప్ప కోలుకోని పరిస్థితి. ఇందుకు సంబంధించి ఖర్చు కూడా భారీగానే ఉంటుందని అంచనా. – డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ చందన(గైనకాలజిస్ట్), నల్లమాడ మండల వైద్యాధికారులు
Comments
Please login to add a commentAdd a comment