పాలమూరు, న్యూస్‌లైన్: పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెడుతున్నప్పటికీ అవి క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలుకావడం లేదు. ఈ కోవలోనే జిల్లాలోని దళితవాడలు, గిరిజన తండాల్లో నివసించే నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రయోజనం కలిగించేందుకు ప్రవేశపెట్టిన ఉచితవిద్యుత్ పథకం అమలుపై సర్వత్రా అయోమయం నెలకొంది.
50 యూనిట్లలోపు వినియోగించే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తారు. విద్యుత్ వినియోగానికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వమే భరించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఎస్సీలకు విద్యుత్ బిల్లులు చెల్లించనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ జీఓ నెం.58ను జారీచేసింది. గిరిజనులకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి.
జిల్లాలో దళితవాడల్లో నివసిస్తూ 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే కుటుంబాలు 28,981 ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆయా కుటుంబాలకు సంబంధించిన పాత బకాయిలు రూ.1516.84 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు జులై నెల నుంచి ఉచితవిద్యుత్ బిల్లులను చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుల కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలోని లబ్ధిదారులు, వారి బకాయిల వివరాలను పంపాలని విద్యుత్‌శాఖను సాంఘిక సంక్షేమశాఖ కోరింది. వారు అందించే వివరాల ఆధారంగా పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఎస్టీలకు సైతం..
గిరిజన తండాల్లో నివసించే గిరిజనులకు ఐటీడీఏ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో మొత్తం వెయ్యి గిరిజన తండాలు ఉండగా.. అందులో చాలా తండాలకు విద్యుత్ సౌకర్యమే లేదు. మిగిలిన తండాల్లో విద్యుత్ సౌకర్యం ఉండగా 45వేల కనెక్షన్లు ఉన్నట్లు సమాచారం. అందులో 35 వేల గిరిజన కుటుంబాలు 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశమున్న దృష్ట్యా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో నిమగ్నమయ్యారు. గిరిజన కుటుంబాల్లో ఎవరెంత విద్యుత్ బకాయిలు ఉన్నారో లెక్కలు తీస్తున్నారు.
ఇళ్లులేని వారి పరిస్థితేంటి?
దళిత, గిరిజన వాడల్లోని ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ను అందించాలనే నిర్ణయం మంచిదైనప్పటికీ అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారు, ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ 50 యూనిట్ల విద్యుత్‌ను వాడేవారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పేదవర్గానికి చెందిన ఎస్సీ, ఎస్టీలకు మేలు చేసేలా వ్యవహరించాల్సిన ప్రభుత్వం కేవలం సమూహంగా ఉండే కాలనీలకే వర్తింపచేస్తామనే విధానం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతరప్రాంతాల్లో నివసించే వారిలో ఎక్కువమంది కూలీపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారిని పట్టించుకోకుండా కేవలం దళితవాడలకు ఇస్తామనడంలో తమకు అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
‘ఉచితం’ అమలెంత?
Published Mon, Aug 5 2013 4:24 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement
Advertisement