‘చంద్రబాబు నన్ను గుర్తించలేదు’
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణతో అధికార టీడీపీలో రేగిన అసంతృప్తి సెగలు చల్లారలేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెద్దపీట వేసి తమకు విస్మరించడంతో టీడీపీ సీనియర్ నాయకులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ మరోసారి అసంతృప్తి వెళ్లగక్కారు. నిబద్ధతతో పనిచేసినా సీఎం చంద్రబాబు తనను గుర్తించలేదని వాపోయారు. రాజకీయాల నుంచి తనకు రిటైర్మెంట్ ప్రకటించారని ఆవేదన చెందారు. మొదట్నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నానని, అయినా తనకు తీవ్ర అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనను విస్మరించారని మీడియా సాక్షిగా కంటతడి పెట్టారు.
ఆరు సార్లు ఎమ్మెల్యేగా, గతంలో ఒకసారి మంత్రి పనిచేసినా తన పేరును కనీసం పరిశీలనలోకి తీసుకోకపోవడంతో ఆయన అలకబూనారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో శివాజీకి మొండిచేయి చూపడాన్ని గౌతు కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. అధిష్టానం వైఖరికి నిరసనగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి ఆయన కుమార్తె శిరీష సిద్ధమయ్యారంటూవార్తలు వచ్చాయి. తనకు కాకుండా కళా వెంకటరావుకు మంత్రి పదవి ఇవ్వడంతో శివాజీ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన అనుచర వర్గాలు చెబుతున్నాయి.