
కురిసే ప్రతి చుక్కా సముద్రంలోకే!
కనీసం గొంతు తడుపుకోవడానికీ చుక్కనీరు దొరకని కరువు పరిస్థితులను రాష్ట్రం ఎన్నోసార్లు చవిచూసింది. రాష్ట్రంలో ఎప్పుడోగానీ విస్తృతంగా వర్షాలు కురిసి, ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోవు.
ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితం... భారీగా నీరు వృథా
సాక్షి, హైదరాబాద్: కనీసం గొంతు తడుపుకోవడానికీ చుక్కనీరు దొరకని కరువు పరిస్థితులను రాష్ట్రం ఎన్నోసార్లు చవిచూసింది. రాష్ట్రంలో ఎప్పుడోగానీ విస్తృతంగా వర్షాలు కురిసి, ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోవు. అలాంటిది ఈసారి రాష్ట్రంతో పాటు ఎగువప్రాంతాల్లోనూ వర్షాలు విస్తారంగా కురిసి, ప్రధాన నదులైన కృష్ణా, గోదావరి పొంగి పొర్లాయి. ఉన్న ప్రాజెక్టులన్నీ నిండిపోయి, వేలాది టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతోంది. అంతేకాదు.. ఇక నుంచి కురిసే ప్రతీ వర్షపు చుక్కా సముద్రం పాలు కానుంది. మరోవైపు రాష్ట్రంలో భారీ సంఖ్యలో నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చివరిదశలో ఉన్నాయి. వాటిని పూర్తిచేసి ఉంటే.. ప్రస్తుతం వృథాగా పోతున్న నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండేది. అసలే గత మూడేళ్లుగా నదుల్లో నీరులేక ప్రాజెక్టులు ఖాళీగా ఉన్నాయి. అదే కొనసాగి ఉంటే.. కరువు పరిస్థితులు నెలకొనేవే. కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం గుణపాఠం రావడం లేదు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే దాదాపు 800 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండేది. తద్వారా సాగుకు, తాగునీటికి కావలసిన నీరు అందుబాటులో ఉండి ప్రజలకు ఎంతో మేలు జరిగేది.
వృథాగా వేలాది టీఎంసీల నీరు..
ఈ ఏడాది రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో.. ప్రధాన నదులైన గోదావరి, కృష్ణాలపై ఉన్న ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిగా నిండిపోయాయి. కృష్ణానదిపై కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ నుంచి రాష్ట్రంలోని జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులతో పాటు గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్ వంటి ప్రాజెక్టులు కూడా వర్షాకాలం మొదట్లోనే నిండాయి. దాంతో గోదావరి నది నుంచి గత జూలై నుంచి ఇప్పటివరకు దాదాపు 5,145 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయింది. అలాగే కృష్ణానది నుంచి కూడా.. 238 టీఎంసీలకు పైగా నీరు సముద్రం పాలయింది.
చివరిదశలోనే నిలిచిపోయిన ప్రాజెక్టుల నిర్మాణాలు..
ప్రస్తుతం గోదావరి, కృష్ణా బేసిన్‌లలో పలు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. అందులో కొన్నింటి నిర్మాణాలు చివరి దశలో ఉండగా.. మరికొన్ని సగానికిపైగా పూర్తయ్యాయి. ఒకటి రెండు ప్రాజెక్టుల పనులు మాత్రం ఇంకా మొదలు కాలేదు. అయితే, నిర్మాణం చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తే.. సుమారు 800 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని, వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ అద్భుత అవకాశాన్ని చేజేతులా జారవిడుస్తోంది. ప్రాజెక్టులను పూర్తి చేయడంపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. కృష్ణానదిపై చేపట్టిన వాటిలో నెట్టెంపాడు, భీమా, కోయల్‌సాగర్, కల్వకుర్తి, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగు గంగ, వెలిగొండ, ఏఎమ్మార్పీ, పులిచింతల ప్రాజెక్టుల నిర్మాణాలు నాలుగేళ్ల కిందే దాదాపు పూర్తయ్యేదశకు చేరుకున్నాయి.
కానీ, రాష్ట్ర సర్కారు గత నాలుగేళ్లుగా వీటిని పూర్తి చేయడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రభుత్వం సకాలంలో స్పందించి, చర్యలు తీసుకుంటే ఈ ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయి ఉండేవి. సుమారు 300 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేది. అలాగే గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టుల్లో ఎస్సారెస్పీ-2, దేవాదుల, శ్రీపాద ఎల్లంపల్లి, రుద్రమకోట వంటి ప్రాజెక్టుల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. ఈ నాలుగేళ్ల సమయంలో వీటితో పాటు పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల వంటి ప్రాజెక్టులు కూడా పూర్తయి ఉండేవి. వీటిద్వారా గోదావరి నదిలో వృథా అవుతున్న నీటి నుంచి సుమారు 500 టీఎంసీలను ఉపయోగించుకునే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది.