బదిలీ అయినా.. కదలని అధికారులు
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
జాతర ముగిసినా జిల్లాలోనే విధులు
ఉన్నవారు వెళితేనే.. కొత్తవారు వచ్చేది
సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సిన అధికారులు.. వాటిని పట్టించుకోవడం లేదు. జిల్లాలోని ఉన్నతాధికారులకు సర్కారు ఆదేశాలు అంటే లెక్కలేని తనంగా ఉంటోంది. ప్రభుత్వ అధికారులు అంటే... బదిలీ చేసిన స్థానాలకు వెళ్లాలి. కానీ, తమకు లబ్ధి కలిగే పోస్టులను వదిలేందుకు వీరు నిరాకరిస్తున్నారు. ఎన్నికల బదిలీలను కూడా ఇదే తీరుగా బేఖాతరు చేస్తున్నారు. బదిలీ అయినవారు జిల్లాను వదిలితేనే ఆ స్థానాలు ఇతరులతో భర్తీచేసే అవకాశం ఉంది. ఎన్నికల నేపథ్యంలో బదిలీ అయిన అడిషనల్ జారుుంట్ కలెక్టర్, జిల్లాపరిషత్ సీఈవో, డీఆర్‌డీఏ పీడీ, ములుగు ఆర్డీవోలు వారి స్థానాలను వదిలేం దుకు ఇష్టపడడం లేదు. బదిలీ అయిన వారు కొత్త స్థానాల్లోకి వెళ్లకపోవడంతో కొత్తవారు రావడం లేదు. ఉన్నవారు పోస్టులను వదలకపోవడంతో... ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ నిర్వహిస్తున్న సమీక్షలకు అర్థంలేకుండా పోతోంది.
ఏజేసీ వెళ్లలేదు...
సంజీవయ్య 2010 జనవరి 4న తొలి అదనపు జాయింట్ కలెక్టర్‌గా జిల్లాకు వచ్చారు. అప్పటికే జిల్లాలో డ్వామా పీడీగా చేసిన అనుభవం, జిల్లా అధికారులతో సత్సం బంధాలు ఉండటంతో ఉత్సాహంగా విధుల్లో చేరారు. అడిషనల్ జేసీ పోస్టుకు అంతగా పోటీ లేకపోవడంతో జిల్లాలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నాలుగేళ్లు పూర్తిచేసుకున్నారు. జిల్లాలో పనిచేస్తున్న కాలంలో సుమారు 10 శాఖలకు పైగా ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. డ్వామా పీడీ నుంచి జేసీ వరకు అన్ని హోదాల్లో పనిచేశారు. కీలకమైన మేడారం జాతర సమయంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా అవకాశం వచ్చింది. అంతా అనుకున్నట్లు జరుగుతోందనుకుంటున్న సమయంలో ఎన్నికల కారణంగా జిల్లాల్లో మూడేళ్లు నిండిన అధికారులకు బదిలీ అప్పనిసరి అయింది.
ఏజేసీ సంజీవయ్యను ప్రభుత్వం నల్లగొండ జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌వో)గా బదిలీ చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 10న ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ మొదట ఇచ్చిన గడువు ఈ నెల 22తో పూర్తయింది. తర్వాత దీన్ని ఈ నెల 25కు పొడిగించారు. మంగళవారంతో ఈ గడువు ముగుస్తోంది. ఏజేసీ సంజీవయ్య మాత్రం రిలీవ్ కావడం లేదు. నల్లగొండ డీఆర్‌వోగా వెళ్లేందుకు సుముఖంగాలేని సంజీవయ్య ఇతర పోస్టుల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడి నుంచి రిలీవ్ కాకపోవడం విమర్శలకు తావిస్తోంది.
డీఆర్‌డీఏ పీడీది కూడా అదేదారి..
ఏజేసీ దారిలోనే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ-ఐకేపీ) ప్రాజెక్టు డెరైక్టరు ఎస్.విజయ్‌గోపాల్ ఉన్నారు. విజయ్‌గోపాల్ గతంలో డీఆర్‌డీఏ ఏవోగా, డ్వామా పీడీగా, హౌసింగ్ ప్రత్యేక అధికారిగా పనిచేశారు. రెండేళ్ల కిత్రం జిల్లా డీఆర్‌డీఏ పీడీగా విధుల్లో చేరారు. ఎన్నికల నేపథ్యంలో విజయ్‌గోపాల్‌ను కరీంనగర్ జిల్లా డీఆర్‌డీఏ పీడీగా బదిలీ చేస్తూ ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ జిల్లా డీఆర్‌డీఏ పీడీగా కరీంనగర్‌లో పని చేస్తున్న శంకరయ్యను నియమించింది. వీరిద్దరు పరస్పర అంగీకారంతో ప్రయత్నాలు చేసుకుని బదిలీలు చేసుకున్నట్లు తెలిసింది. కోరుకున్న స్థానానికి బదిలీ చేసిన్పటికీ డీఆర్‌డీఏ పీడీ విజయగోపాల్ రిలీవ్ కావడం లేదు. మేడారం విధుల్లో పాల్గొంటున్న వారిని జాతర తరువాత రిలీవ్ చేసేందుకు ప్రత్యేక అనుమతి తీసుకున్న కలెక్టర్ ఈ నెల 16న ఆదివారం తహసీల్దార్లను రిలీవ్ చేశారు. విజయగోపాల్ మాత్రం గడువు దగ్గరపడినా రిలీవ్ కాలేదు.
జేడ్పీ సీఈఓ ఆంజనేయులూ అంతే..
జిల్లా పరిషత్ సీఈవో జి.ఆంజనేయులు గతంలో ములుగు ఆర్డీవోగా పనిచేశారు. ప్రస్తుతం సీఈవోగా కొనసాగుతున్నారు. ఖమ్మం జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) పీడీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆంజనేయిలు రిలీవ్ కాలేదు.. అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఆంజనేయులు మరో నాలుగు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ కారణంతో ఆయన తన బదిలీ రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్ ద్వారా ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆర్డీఓ మోతీలాల్ బదిలీ రద్దు...
ములుగు ఆర్డీవో మోతీలాల్‌ది దాదాపు ఇలాంటి పరిస్థితే. ఫిబ్రవరి 10న జరిగిన బదిలీల్లో ములుగు ఆర్డీవో మోతీలాల్ ఉన్నారు. కరీంనగర్ జిల్లా పౌర సరఫరాల విజిలెన్స్ విభాగం అధికారి రాంచందర్‌ను ఈ పోస్టులో నియమించారు. రాంచందర్ విధుల్లో చేరేందుకు రెండు రోజులు కలెక్టరేట్‌కు వచ్చినా జిల్లా ఉన్నతాధికారులు చేర్చుకోలేదు. ఎన్నికల బదిలీ మోతీలాల్‌కు వర్తించదని, జిల్లాకు కొద్ది రోజుల కిత్రమే వచ్చారని కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల సంఘానికి వివరించినట్లు తెలిసింది. మోతీలాల్ బదిలీకి రాజకీయ కారణం ఉన్నట్లు వినికిడి. మేడారం జాతర ఏర్పాట్ల విషయంలో మోతీలాల్ మంత్రులతో వాగ్వాదానికి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మంత్రులు ఈయన బదిలీకి పట్టుబట్టారు. చివరికి కలెక్టర్ జోక్యంతో బదిలీ ఆగిపోయింది.
సీటు వదలరా ?
Published Tue, Feb 25 2014 4:01 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
Advertisement
Advertisement