డాక్టర్లపై పర్‌ఫార్మెన్స్ కత్తి
► ప్రతి నెలా వైద్యులకు గ్రేడింగ్‌లు
► ఈ నెల నుంచే వర్తింపు..ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
విధులకు డుమ్మా కొట్టే, సమయపాలన పాటించని డాక్టర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (సీహెచ్‌సీ) పనిచేసే డాక్టర్ల పనితీరును తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లాలోని ప్రతి ఒక్క పీహెచ్‌సీ, సీహెచ్‌సీలో పనిచేసే డాక్టర్లు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల ఆధారంగా పాయింట్లను ఇచ్చి నెలవారీ గ్రేడింగ్‌లను కేటాయించనుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో విధులకు సక్రమంగా హాజరుకానివారిలో ఆందోళన నెలకొంది.
నెల్లూరు (బారకాసు) : ప్రజలకు పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో అందుతున్న వైద్య సేవల ఆధారంగా డాక్టర్లకు గ్రేడింగ్ ఇవ్వనున్నారు. గ్రేడింగ్ ఆధారంగా డాక్టర్ల పనితీరు (కీ–పర్‌ఫార్మెన్స్ ఇండికేటర్)ను మదింపు చేయనున్నారు. ఈ నెల నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతి పీహెచ్‌సీ పరిధిలోని వైద్యాధికారి నెలలో ఎన్ని ఆరోగ్య ఉపకేంద్రాలను సందర్శిం చారు? ఎంత మంది అవుట్ పేషెంట్లు (ఓపీ)ను చూశా రు? హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల్ని ఎన్ని గుర్తించారు? వారికి అందించిన వైద్య సేవలేమిటి? సామాజిక వ్యాధుల నిర్మూలనకు తీసుకున్న చర్యలు, ఇమ్యునైజేషన్ కార్యక్రమాల అమలు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు, ఎన్టీఆర్ బేబీ కిట్, జననీ సురక్షణ యోజన పారితోషికం, నెలలో విధులకు ఎన్ని రోజులు హాజరయ్యారు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారా? వంటి అంశాల ఆధారంగా వైద్యాధికారులకు గ్రేడింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వీటిలో కొన్ని అంశాలకు 5 మార్కులు, మరికొన్నింటికి 2.5 మార్కులు కేటాయిస్తారు. వంద మార్కులకు వైద్యాధికారుల పనితీరుని ప్రతినెలా మదింపు చేసి జిల్లా స్థాయిలో గ్రేడింగ్‌లను కేటాయిస్తారు. నెలలో ఒక్కో వైద్యాధికారి కనీసం 2,500 మంది అవుట్ పేషంట్లను చూడాలని లక్ష్యంగా నిర్దేశించారు. రాష్ట్ర వైద్యారో గ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలతో వీరి పనితీరును అంచనా వేశారు. ఇది ప్రతి నెలా ఉంటుందని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రతి నెలా 10వ తేదీ ఈ వివరాలతో కూడిన నమూనాలను పూర్తి చేసి పీహెచ్‌సీలోని వైద్యాధికారులు జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో పనిచేసే రెగ్యులర్, కాంట్రాక్ట్ వైద్యాధికారులు ప్రతి ఒక్కరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి.
ప్రోత్సాహకాలు
విధుల్లో మంచి పనితీరు కనబరిచే వైద్యాధికారులకు గ్రేడ్ల ఆధారంగా ప్రోత్సాహకాలను అందించనున్నట్లు ప్రభుత్వ ఆదేశాల్లో పే ర్కొంది. మంచి మార్కులు వచ్చినవారికి నగదు రివార్డులను సైతం ఇవ్వనున్నారు. ఈ పోటీల్లో ప్రతి వైద్యాధికారీ పాల్గొని తీరాల్సిందే. చాలా వరకు పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండటం లేదని, సమయపాలన పాటించలేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో గ్రేడింగ్ విధానం వైద్యుల్లో జవాబుదారితనం పెంచనుంది.