కొత్త బడ్జెట్‌పై కసరత్తు
Published Sun, Dec 1 2013 1:43 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
సాక్షి, రాజమండ్రి :వచ్చే ఏడాది బడ్జెట్ రూప కల్పనకు ఇప్పటి నుంచే అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రవేశ పెట్టాల్సిన బడ్జెట్‌పై అధికారులు కసరత్తులు ప్రారంభించారు. వచ్చే నెలాఖరు లోగా బడ్జెట్ రూపాంతరాన్ని కలెక్టర్ ఆమోదంతో పురపాలక శాఖ కమిషనరేట్‌కు చేరాల్సి ఉండడంతో ప్రస్తుతం కమిషనర్ల దృష్టి అంతా ఆదాయ వ్యయాలపై పెట్టారు. ఓ పక్క భారీ వర్షాలు తుఫానుల కారణంగా రహదారులు, మురుగు కాలువల వ్యవస్థలు అధ్వాన్నంగా తయారయ్యాయి. దీనికితోడు సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం పురపాలికల ఆదాయంపై కూడా పడింది. మరో పక్క ఆస్తిపన్నుల బకాయిలు మున్సిపాలిటీల్లో పేరుకుపోయాయి. ఇలా ఆదాయం తగ్గి.. వ్యయం పెరిగిన నేపధ్యంలో గత సంవత్సరాల బడ్జెట్ కన్నా కొత్త బడ్జెట్‌పై ఎన్నో బాధ్యతలు, భారాలు ఉండడంతో కమిషనర్లు తలలు పట్టుకుంటున్నారు.
పుష్కరాల బడ్జెట్
రాజమండ్రిలో గోదావరికి గత పుష్కరాలు 2003లో జూలై 30 నుంచి ఆగస్టు 10 వరకూ జరిగాయి. వచ్చే పుష్కరాలు 2015 జూలైలో ప్రారంభం అవుతాయి. దీంతో నగర అభివృద్ధితో పాటు, పుష్కర వసతుల కల్పనకు రాబోయే బడ్జెట్ కీలకంగా నిలుస్తోంది. పుష్కరాలకు ప్రభుత్వం అదనపు నిధులు ఇస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కార్పొరేషన్ స్థాయిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు రూ. కోట్లలో ఉన్నాయి. గత పుష్కరాలకు రూ. 100 కోట్లతో అంచనాలు తయారు చేసి పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఏడాది పెరిగిన జనాభా తదితర కారణాలతో కనీసం రూ. 300 కోట్ల మేర వ్యయం కాగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ నిధులు ఎలా వెచ్చిస్తారు. ప్రణాళికలు ఏలా రూపొందిస్తారు అనే అంశాలపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
రూపకల్పనల ప్రణాళిక ఇలా..
కొత్త బడ్జెట్ ప్రాధమిక అంచనాలను డిసెంబర్ నెలాఖరులోగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని రెండు రోజుల క్రితం అన్ని మున్సిపాలిటీలకు ఆదేశాలు అందాయి. బడ్జెట్‌లో ముందుగా 2013-14 ఆర్థిక సంవత్సరపు అంచనాలు పరిగణలోకి తీసుకుని కొత్తగా చేపట్టాల్సిన చేర్పులతో 2014-15 బడ్జెట్ రూపొందిచాల్సి ఉంటుంది. దీంతో పాటు గత బడ్జెట్‌లో ఇప్పటి వరకూ చోటు చేసుకున్న మార్పులు చేర్పులు కూడా నివేదించాల్సి ఉంటుంది. కొత్తగా సమర్పించే బడ్జెట్‌లో ఆమోదం సమయంలో కొత్తగా చేర్పులు చేయకూడదు. అలాంటి అవసరం ఏర్పడినప్పుడు విధిగా పురపాలక శాఖ కమిషనరేట్‌లో అనుమతి పొందాలి. ఇటువంటి నిబంధనలతో అందిన ఆదేశాల మేరకు అధికార గణం కొత్త బడ్జెట్‌కు లెక్కలు కడుతున్నారు.
కౌన్సిళ్లు లేవు
పురపాలికలకు రెండేళ్లుగా ఎన్నికలు లేవు. దీంతో బడ్జెట్‌ను స్టాండింగ్ కమిటీ పర్యవేక్షణలో రూపొందిస్తున్నారు. గత బడ్జెట్‌లో జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి నగర పాలక సంస్థలు సహా జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో బడ్జెట్‌ను నామమాత్రంగా రూపొందించారు. కేవలం నిర్వహణకు తప్ప అభివృద్ధికి పెద్దపీట వేయలేదు. దీంతో కీలకంగా నిలవనున్న కొత్త బడ్జెట్‌పై అధికారులు ఏమాత్రం ప్రత్యేక దృష్టి పెడతారో వేచి చూడాల్సిందే.
Advertisement